రామజన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ధర్మకర్త అయిన కామేశ్వర్ చౌపాల్ (68) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యకు చికిత్స తీసుకుంటున్న కామేశ్వర్ చౌపాల్, ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో కన్నుమూసారు. ఆయన కుమార్తె ఒక మూత్రపిండం ఇచ్చినప్పటికీ, కొద్దిరోజుల క్రితం చేసిన ఆపరేషన్ ఫలించలేదు.
కామేశ్వర్ చౌపాల్ విశ్వహిందూ పరిషత్‌లో సీనియర్ సభ్యుడు. రామమందిర ఉద్యమంలో ప్రథమ కరసేవకుడిగా ఆయనకు విశేషమైన గుర్తింపు ఉంది. 1989లో అయోధ్యలో రామజన్మభూమికి మొదటి పునాదిరాయి వేసిన గౌరవం ఆయన సొంతం. ఆయన బిహార్ రాష్ట్ర శాసనమండలిలో ఎంఎల్‌సీగాను, రెండుసార్లు ఎంపీగానూ పనిచేసారు కూడా.
పలువురు రాజకీయ నాయకులు, పలు సామాజిక సంస్థలు కామేశ్వర్ చౌపాల్ మృతికి నివాళులర్పించాయి. విశ్వహిందూ పరిషత్ సంస్థ తమ ఎక్స్ ఖాతాలో ‘‘ఆయన మరణం దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు ఈ కష్టకాలాన్ని సహనంతో ఓర్చుకోవాలనీ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం’’ అంటూ నివాళులర్పించింది.
బీజేపీ సీనియర్ నాయకుడు, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ధర్మకర్త అయిన కామేశ్వర్ చౌపాల్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసారు. ‘చౌపాల్ అంకితభావం కలిగిన రామభక్తుడు, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆయన చేసిన సేవలు విలువైనవి’ అని ట్వీట్ చేసారు. దళితుడైన చౌపాల్ తన జీవితకాలమంతా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసారని మోదీ వ్యాఖ్యానించారు.
కామేశ్వర్ చౌపాల్ తన జీవితాన్ని ధార్మిక, సామాజిక సేవకు అంకితం చేసారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎక్స్‌లో ఆయన ట్వీట్‌లో ‘‘విముక్త ఆత్మకు భగవాన్ శ్రీరాముడు తన చరణపద్మాల చెంత స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. ఓం శాంతి’’ అని రాసుకొచ్చారు.
కామేశ్వర్ చౌపాల్ బిహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందిన వారు. 1989 నవంబర్ 9న అయోధ్య రామజన్మభూమి మందిరానికి పునాదిరాయి వేయడం ఆయనకు కీర్తి తెచ్చిపెట్టింది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తగా ఆయన రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ సంస్థలో ఆయన 1982లో చేరారు. 1989లో విహెచ్‌పి బిహార్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అయ్యారు. ఆయన నాయకత్వంలోనే దేశంలోని అన్ని గ్రామాల నుంచీ రామశిలలు సేకరించే ఉద్యమం మొదలైంది. ప్రతీ గ్రామం ఒక ఇటుక, రూపాయి పావలా దక్షిణ సమర్పించాలన్నది ఆ ఉద్యమం. తద్వారా దేశవ్యాప్తంగా రామమందిరం గురించిన ఆలోచన రేకెత్తించాలన్న ఆయన ప్రణాళిక విజయవంతమైంది.