ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మి మీద బీజేపీ నాయకుడు దర్శనపు శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేసారు. వీసీ జయలక్ష్మి నియామకం, ఆమె నేతృత్వంలో విశ్వవిద్యాలయం ఆవరణలో క్రైస్తవ మత కార్యకలాపాలు, వర్సిటీ నిర్వహణలో లోపాల వంటి అంశాలపై ఆరోపణలు చేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసారు.
గుంటూరుకు చెందిన బీజేపీ నాయకుడు దర్శనపు శ్రీనివాస రావు తన ఫిర్యాదులో మొదట శారదా జయలక్ష్మి నియామకం మీదనే ఆరోపణలు గుప్పించారు. గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో శారద జయలక్ష్మి నియామకం ప్రతిభ ప్రాతిపదికన కాకుండా రాజకీయ సంబంధాలు, పులివెందులకు చెందిన ఒక చర్చి పాస్టర్ సిఫారసు ఆధారంగా జరిగిందని ఆయన ఆరోపించారు.
శారద జయలక్ష్మి గురించి మరొక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. ఆమె విశ్వవిద్యాలయం కార్యనిర్వహణా భవనంలో, కార్యాలయం పనిచేస్తున్న సమయంలో క్రైస్తవ ప్రార్థనలు నిర్వహింపజేస్తున్నారు, మిషనరీల కార్యకలాపాలు జరుపుకోడానికి అండగా నిలుస్తున్నారు. ఇలా ఒక విద్యాసంస్థలో ప్రత్యక్షంగా ఒక మతానికి అనుకూలంగా పని చేయడం విద్యాసంస్థ లౌకిక స్వభావాన్ని దెబ్బతీయడమే. విశ్వవిద్యాలయం తటస్థంగా ఉండాల్సిన స్వభావాన్ని ఉల్లంఘించడం పట్ల వర్సిటీలోని పలువురు అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో శారద జయలక్ష్మి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఆవిడ వీసీగా విధుల్లో చేరిన నాటినుంచీ వర్సిటీ ఉద్యోగుల్లో అసంతృప్తి, నిస్పృహ ధోరణులు పెరిగిపోయాయి. విశ్వవిద్యాలయ నిర్వహణలో వీసీ అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు వెళ్ళాయి. కీలక నిర్ణయాల్లో పక్షపాత ధోరణి, పారదర్శకంగా వ్యవహరించకపోవడం గురించి ఆమెపై ఫిర్యాదులు చాలా ఉన్నాయి.
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా శారద జయలక్ష్మి నియామకం, వర్సిటీ పాలనా వ్యవహారాల్లో ఆమె అక్రమాలు, అంతకంటె ముఖ్యంగా విద్యాసంస్థను క్రైస్తవ మతప్రచారానికి కేంద్రంగా దుర్వినియోగం చేయడంపై బీజేపీ నేత శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వీసీపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, శారద జయలక్ష్మి వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆయన గతవారం లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసారు.