ఫిబ్రవరి 4 పార్లమెంటు లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా మండిపడ్డారు. మోదీ ప్రభుత్వపు విదేశాంగ విధానం గురించి రాహుల్ చేసిన విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. ఆ క్రమంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు పరిణతి చెందిన నేతలలా కనిపించడం కోసం విదేశాంగ విధానం వంటి అంశాలను ప్రస్తావిస్తారంటూ చురకలు వేసారు.
రాహుల్ గాంధీ పేరు నేరుగా ప్రస్తావించకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విదేశాంగ విధానం గురించి అర్ధం చేసుకోవాలని నిజాయితీగా భావించే వారికి ఒక సూచన చేసారు. ‘‘విదేశాంగ విధానం మీద నిజంగా ఆసక్తి ఉంటే, దాన్ని అర్ధం చేసుకోవాలని భావిస్తే, ఆ విషయంలో ఏదో ఒకటి చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా ‘జేఎఫ్‌కేస్ ఫర్గాటెన్ క్రైసిస్’ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. ప్రముఖ విదేశాంగ విధాన విద్వాంసుడు రచించిన ఆ పుస్తకంలో భారతదేశపు మొదటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ, జాన్ ఎఫ్ కెన్నడీ మధ్య సంభాషణలతో పాటు ఎన్నో ముఖ్యమైన సంఘటనల గురించి వివరంగా రాసారు’’ అని మోదీ చెప్పారు.
ఆ పుస్తకం భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను గురించి, చర్చల గురించీ వెల్లడించింది. భారతదేశం కఠినమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న వేళ అనుసరించిన వ్యూహాలను బైటపెట్టింది. నరేంద్ర మోదీ ప్రధానంగా భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం అయిన 1962 చైనా-భారత్ యుద్ధం గురించి విస్తారంగా వివరించడం గురించి ప్రస్తావించారు. కొందరు నాయకులు తాము విమర్శించే విషయాల చారిత్రక సందర్భాలను అర్ధం చేసుకోవడంలో విఫలమవుతారని దాన్ని బట్టి తెలుస్తుంది. ‘‘దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు విదేశఆంగ విధానం పేరు మీద ఏం చేసారన్న విషయం గురించి ఆ పుస్తకం బైటపెట్టింది. అందుకే దాన్ని చదివి తీరాలని చెబుతున్నాను’’ అన్నారు మోదీ.
నెహ్రూ విదేశాంగ విధానంతో భారతదేశానికి నష్టం:
ప్రపంచ శాంతి గురించి నెహ్రూ ఆదర్శవంతమైన దృష్టి, ఆయన ప్రతిపాదించి అనుసరించిన ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ విధానం భారతదేశపు అతిభయంకరమైన వ్యూహాత్మకమైన తప్పిదాలుగా మిగిలాయి. సరిహద్దుల వెంబడి చైనా చొరబాట్ల గురించి నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తూ నివేదికలు సమర్పించినప్పటికీ నెహ్రూ, ఆయన క్యాబినెట్‌లో రక్షణ మంత్రి వి.కె కృష్ణమీనన్‌లు పొంచివున్న ముప్పును కొట్టిపడేసారు. భారతదేశపు సైనిక సంసిద్ధతను బలపరచడానికి బదులు నెహ్రూ ప్రభుత్వం దౌత్యమార్గాన్ని ఎంచుకుంది. తన మంచితనానికి చైనా సానుకూలంగా స్పందిస్తుందని భావించారు నెహ్రూ.
1950ల చివరిదశలో నెహ్రూ కన్న కలల్లో పగుళ్ళు బైటపడసాగాయి. భారతదేశంలో అంతర్భాగమైన, వ్యూహాత్మకంగా కీలకమైన అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా చైనా ఏకపక్షంగా రహదారి నిర్మించేసింది. నెహ్రూ మొదట్లో ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచివుంచాడు. చైనాతో ఘర్షణను నివారించవచ్చునని ఆయన భావించారు మరి. తను ప్రతిపాదించిన పంచశీల ఒప్పందానికి చైనా కట్టుబడి ఉంటుందనే భ్రమలో ఉండిపోయారాయన. దాంతో దేశం సురక్షితంగా ఉందనే తప్పుడు ఆలోచనలో మిగిలిపోయారు.
దానికి తోడు 1961లో భారత్-చైనా మధ్య వివాదాస్పదంగా తయారైన ప్రాంతాల్లో ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయడానికి ‘ఫార్వర్డ్ పాలసీ’ ప్రారంభించారు. దాన్ని చైనా మరింత తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరుదేశాల మధ్యా శత్రుత్వం పెరిగింది. సరైన ఆయుధాలు లేని, ఏమాత్రం తయారుగా లేని భారత సైన్యాన్ని బలమైన ప్రత్యర్ధి అయిన చైనా సైన్యాన్ని ఎదుర్కోవాలని ఆదేశించారు. అలా అని భారత సైన్యానికి తగిన ఆయుధాలు, మందుగుండు, రవాణా సౌకర్యాలు ఏమీ ఇవ్వలేదు. 1962 అక్టోబర్ 20న యుద్ధం వచ్చేసరికి భారతదేశం దగ్గర ఏ వ్యూహమూ లేదు, కనీసం ఆయుధాలైనా లేవు.
ఆ యుద్ధం నెల రోజులకు మించి జరగలేదు, కానీ దాని ప్రభావం చాలా విధ్వంసకంగా పడింది. చైనా దేశపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చాలా వేగంగా ముందుకొచ్చేసింది. అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ ప్రాంతాల్లో భారత సైన్యాన్ని ఎదుర్కొంది. ఆయుధాలు, చలిని ఎదుర్కొనడానికి సరైన దుస్తులూ లేని భారత సైన్యం, ఓడిపోడానికే యుద్ధం చేయాల్సి వచ్చింది.
1962 నవంబర్ నాటికి నెహ్రూ కలలు పూర్తిగా ఛిద్రమైపోయాయి. ‘జేఎఫ్‌కేస్ ఫర్గాటెన్ క్రైసిస్’లో నెహ్రూ సైనిక సహాయం కోసం అమెరికాను అభ్యర్ధించిన లేఖల వివరాలు ఉన్నాయి. ఆ లేఖలు భారత్ ఎంత నిస్సహాయ స్థితిలో పడిపోయిందో వివరిస్తాయి. అమెరికా, ఇంగ్లండ్ కొంత సహాయం అందించాయి, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నవంబర్ 21న చైనా ఏకపక్షంగా యుద్ధవిరమణ ప్రకటించింది. అప్పటికే భారత సైన్యపు బలహీనతలను చైనా బైటపెట్టింది, కొన్ని భూభాగాలను లాగేసుకుంది.
చైనాతో జరిగిన 1962 యుద్ధంలో ఓటమి భారతదేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఆ ఓటమే భారతదేశం నేటికీ అనుసరిస్తున్న వ్యూహాత్మక, ప్రపంచ భౌగోళిక రాజకీయ దృక్పథాన్ని తీర్చిదిద్దింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తప్పుడు విధానాలు, చైనాపై తప్పుడు నమ్మకం, యుద్ధానికి సన్నద్ధమవడంలో అప్పటి ప్రభుత్వపు వైఫల్యం కారణంగా భారతదేశం యుద్ధభూమిలో అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కొన్ని దశాబ్దాల తర్వాత, జాతీయ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ వైఖరి, ఆయన తాజా వ్యాఖ్యలు పూర్తిగా వేరుగా ఉంది. చైనా విషయంలో నెహ్రూ బుజ్జగింపు ధోరణికి, మోదీ దృఢ వైఖరి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
ఒకప్పుడు అంతర్జాతీయ దౌత్యంలో శిఖరాయమానుడిగా పేరు గడించిన నెహ్రూ ఆ యుద్ధం కారణంగా దేశాన్ని సంకటంలో పడేసిన నాయకుడి స్థాయికి పతనమైపోయారు. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది, అధికారంపై ఆయన పట్టు సడలిపోయింది. రక్షణమంత్రి కృష్ణమీనన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అన్నిటికంటె ప్రధానంగా నెహ్రూ విశ్వసనీయత తిరిగి బాగుచేయలేనంత దారుణంగా దెబ్బతింది. రెండేళ్ళ తర్వాత ఆయన కాలం చేసేనాటికి భారతదేశానికి చరిత్రలోనే అత్యంత దరిద్రమైన ఓటమిని అందించిన మరక మిగిలిపోయింది.
14,500 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించిన చైనా:
1962 అక్టోబర్‌లో చైనా దాడి భారతదేశ సైన్యాన్ని చావుదెబ్బ కొట్టింది. సరైన ఆయుధాలు, సరైన రాజకీయ మార్గదర్శనం లేక భారత సైన్యం డీలా పడింది. అదే అదనుగా చైనా, భారతదేశపు కశ్మీర్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ అనే 14,500 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ చర్యను ఎదుర్కోడానికి నెహ్రూ ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు. నిఘా వర్గాలు పదేపదే హెచ్చరించినా, చైనా దాడి చేసే అవకాశమే లేదంటూ నెహ్రూ కొట్టిపడేసారు. ఆయన మితిమీరిన నమ్మకంతో కూడిన ‘హిందీ చీనీ భాయీ భాయీ’ దౌత్య విధానం భారతదేశానికి ఘోర విపత్తుగా నిలిచింది.
చివరికి యుద్ధం మొదలయ్యేసరికి నెహ్రూ ఏమీ పాలుపోని నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారు. భారతదేశానికి వెంటనే సైనిక సహాయం చేయాలంటూ అమెరికాను అర్ధించారు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి రాసిన లేఖలో ఒక విమానంలో ఆయుధాలు పంపించమని కోరారు. అంతే కాదు, అమెరికన్ పైలట్లతో కూడిన విమానాలను పంపించమని, భారతదేశపు నగరాలను రక్షించడానికి వైమానిక దళాలను పంపించమనీ అడిగే దుస్థితికి దిగజారారు. భారత సైన్యం అవమానకరమైన ఓటమి కారణంగా అమెరికాకు చెందిన వందల మంది మిలటరీ సలహాదారులు, వైమానిక దళ సిబ్బంది భారత్ వచ్చారు.
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, భారతదేశపు భూభాగాన్ని ఆక్రమించడానికి కొద్దికాలం ముందే, కమ్యూనిస్టు చైనాకు ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో స్థానం కల్పించాలంటూ నెహ్రూ లాబీయింగ్ చేసారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌తో జరిపిన చర్చల్లో ‘60 కోట్ల జనాభా కలిగిన దేశం నేడైనా రేపైనా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించడమే సరైన తర్కం అవుతుంది’ అని నెహ్రూ వాదించారు. భారతదేశానికి రావలసిన భద్రతా మండలి స్థానాన్ని చైనాకు త్యాగం చేసేసారు. ఆ చర్య చైనాను ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు సాయపడింది, అదే చైనా విస్తరణవాదానికి భారతదేశం బలైపోయింది.
చైనా విస్తరణవాదానికి నెహ్రూ కళ్ళ ముందరి ఉదాహరణ 1950లో టిబెట్‌ను ఆక్రమించడమే. అలాంటి చైనా విస్తరణవాదం పట్ల ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ నెహ్రూ ఆ దేశం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏనాడూ సఫలం కాలేదు. చైనా టిబెట్‌ను ఆక్రమించడం కుటిలమైన చర్య అనీ, అది భారతదేశానికి ప్రత్యక్షంగా ప్రమాదమనీ ఆనాటి ఇంటలిజెన్స్ చీఫ్ బి.ఎన్ మల్లిక్ నెహ్రూను హెచ్చరించారు. కానీ నెహ్రూ ఆ ఆందోళనలను కొట్టిపడేసారు. టిబెట్ మీద తమ పట్టును మరింత దృఢపరచుకునేందుకు చైనాకు అవకాశం కల్పించారు. 1959లో టిబెట్‌లో తిరుగుబాటు జరిగినప్పుడు, చైనాతో స్నేహ సంబంధాలను కొనసాగించే నెహ్రూ సామర్థ్యం కుప్పకూలిపోయింది. చైనాపై నెహ్రూ కఠినమైన వైఖరి అవలంబించాలంటూ నెహ్రూ మీద నాటి పాత్రికేయులు ఒత్తిడి తెచ్చారు.
చైనా భారత్ యుద్ధంపై సీఐఏ పోస్ట్‌మార్టమ్:
1962 చైనా భారత్ యుద్ధాన్ని సీఐఏ 1965లో విశ్లేషించింది. ఆ నివేదిక ప్రకారం చైనా చాలా గొప్పగా నెహ్రూను మోసగించింది. నెహ్రూ సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణిని, ఏ యెండకా గొడుగు పట్టే సహజ లక్షణాన్ని, తమతో భారతదేశానికి సత్సంబంధాలు ఉండాలన్న ఆయన కోరికనూ చైనా తనకు అనుకూలంగా వాడుకుంది. అప్పటి చైనా ప్రధాని (ప్రీమియర్) చౌ ఎన్ లై భారత చైనా సరిహద్దుల గురించి బైటకు ఏమీ మాట్లాడేవాడు కాదు, అదే సమయంలో చైనా మ్యాప్‌లు భారత్‌లోని భారీ విస్తీర్ణాలు కలిగిన ప్రాంతాలను తమవిగా తమ మ్యాప్‌లలో చూపించుకుంది. చైనా నెహ్రూను విజయవంతంగా మోసం చేయగలిగింది. అలా 1962 యుద్ధంలో భారతదేశాన్ని ఓడించగలిగింది.
భారత్ ఓవైపు భూభాగాన్ని కోల్పోయింది, మరోవైపు సముద్ర జలాల్లో వేలాది భారతీయులు చనిపోయారు. ఆ నేపథ్యంలో ఇంక గత్యంతరం లేని పరిస్థితుల్లో నెహ్రూ అమెరికా ముందు చేతులు చాచారు. ‘చైనా ఆక్రమణలను ఎదుర్కోడానికి భారతదేశానికి విమాన రవాణా, జెట్ ఫైటర్లు పుట్టలు పుట్టలుగా కావాలి’. అంతకంటె పెద్ద షాక్, భారత దేశానికి అమెరికా గగన రవాణా సౌకర్యాలు, జెట్ ఫైటర్స్ కావాలంటూ అగ్రరాజ్యాన్ని ప్రాథేయపడ్డారు. ‘‘కనీసం 12 స్క్వాడ్రన్ల సూపర్‌సానిక్ ఆల్‌వెదర్ ఫైటర్స్ అత్యవసరం. మా దేశంలో ఆధునిక రాడార్ కవర్ లేదు. కాబట్టి ఆ ఫైటర్ విమానాలను నడిపేందుకు, రాడార్ వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు మీ బలగాలు కావాలి. అదే సమయంలో మా సైన్యాలకు శిక్షణా కావాలి’’ అని అడిగారు.
ఆ అసాధారణమైన విజ్ఞప్తే నెహ్రూ హయాంలో భారత సైన్యం ఎంత బలహీనంగా ఉందన్న విషయాన్ని బైటపెట్టింది. కొరియాలో చైనా బలగాలతో పోరాడి ఒక్క దశాబ్దం గడిచిన తర్వాత అమెరికాను మరోసారి ఆ దేశంతో తలపడాలని భారత్ అడిగింది. అయితే అక్కడ సమస్య భారతదేశం స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం కావడం గమనార్హం. 1962 యుద్ధం జరిగి ఆరు దశాబ్దాలు గడిచిపోయినా దాని ఫలితం భారతదేశపు చైనా విధానంపై నేటికీ తీవ్రంగా ప్రభావం చూపిస్తూనే ఉంది.
నెహ్రూ వైఖరికి పూర్తి భిన్నంగా మోదీ విదేశాంగ విధానం:
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పాలనలో జాతీయ భద్రతకు అమిత ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ హయాంలోలా కాకుండా భారతదేశం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. చైనా ఆక్రమణల మీద మోదీ సర్కారు కఠినంగా వ్యవహరించింది. ప్రత్యేకించి 2020 గాల్వన్ లోయ ఘర్షణల నేపథ్యంలో భారతదేశపు వైఖరి, నెహ్రూ అనుసరించిన నాన్చుడు ధోరణికి భిన్నంగా నిలిచింది. ఇప్పుడు పార్లమెంటులో నెహ్రూ మీద మోదీ చేసిన వ్యాఖ్యలు 1962 చైనా భారత్ యుద్ధం సమయంలో నెహ్రూ వైఖరిని మరోసారి చర్చకు పెట్టాయి. నెహ్రూ తప్పుడు వ్యూహాలు, నిర్ణయాలు, దౌత్యపరంగా తప్పుడు లెక్కల కారణంగా స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ఘోరంగా అవమానకరంగా ఓడిపోయిన విషయాన్ని బ్రూస్ రీడెల్ రాసిన ‘జేఎఫ్‌కేస్ ఫర్గాటెన్ క్రైసిస్: టిబెట్, ది సీఐఏ, అండ్ ది సినో ఇండియన్ వార్’ పుస్తకం స్పష్టంగా వివరించింది. ఆ పుస్తకాన్ని చదవాలన్న మోదీ ప్రకటన కేవలం రాజకీయపరమైన చురక మాత్రమే కాదు, కీలక సమయంలో సరైన నాయకత్వం లేకపోవడం దేశ గతిని ఎలా మార్చేస్తుందన్న విషయాన్ని గుర్తు చేసింది.
నెహ్రూ ప్రభుత్వపు భారీ తప్పిదాలను పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ ప్రభుత్వం అలాంటి చరిత్రను పునరావృతం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసారు. మోదీ హయాంలో దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలూ గణనీయంగా పెరిగాయి. భారత సైన్యాలకు ఇప్పుడు మెరుగైన రోడ్లు, పరికరాలు, ఆయుధాలు, రవాణా సదుపాయాలు ఉన్నాయి. 1962 యుద్ధం తర్వాత భారతదేశం సైనిక సహాయం కోసం సోవియట్ యూనియన్ మీద, పాశ్చాత్య దేశాల మీద పూర్తిగా ఆధారపడింది. నెహ్రూ చేసిన ఆ తప్పును మోదీ చేయడం లేదు. సైనిక అవసరాల కోసం విదేశీ దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితిని తగ్గించడం మీద మోదీ సర్కారు దృష్టి పెట్టింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాకారం చేస్తోంది.
‘శాంతి కోసం ఏది పోయినా పర్వాలేదు’ అనే నెహ్రూలా కాకుండా నరేంద్ర మోదీ అవసరమైనప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 2017లో డోక్లాం ఘర్షణలు, 2020 గాల్వన్ ఘర్షణల సమయంలో చైనా దూకుడుకు, రెచ్చగొట్టే తనానికీ భారత్ తన బలంతోనే జవాబు చెప్పింది తప్ప 1962లోలా పలాయనం పఠించలేదు.
మోదీ పద్ధతి నిజమైన రాజకీయ నాయకుడి పద్ధతిలా ఉంది. భారతదేశపు సైన్యాలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక పొత్తులతో ప్రపంచంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడం, సరిహద్దుల దగ్గర ఏకపక్ష మార్పులను ఒప్పుకోడానికి నిరాకరించడం వంటి విషయాల్లో మోదీ రాజనీతిజ్ఞత స్పష్టమైంది. చైనాతో ఆర్థిక విషయాల్లోనూ భారతదేశం ఇప్పుడు కఠినంగానే వ్యవహరిస్తోంది. వివిధ రంగాల్లో చైనా పెట్టుబడులను నియంత్రిస్తోంది, చైనీస్ సంస్థలకు చెందిన యాప్‌లను నిషేధిస్తోంది. ఇలా… విదేశాంగ విధానంలో భారతీయమైన ముద్ర వేస్తోంది.