ఇంగ్లండ్, భారత్ మధ్య నాగపూర్ లో జరిగిన వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత్ 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసి విజయం సాధించింది.
భారత బ్యాటర్లలో ముగ్గురు అర్ధ శతకాలు కొట్టారు. వైఎస్ కెప్టెన్ హోదాలో బ్యాటింగ్ కు దిగిన శుభమన్ గిల్ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ ( 52) రాణించారు. యశస్వీ జైస్వాల్ (15), రోహిత్ శర్మ(2), కేఎల్ రాహుల్ (2) విఫలమయ్యారు. మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజులో హర్దిక్ పాండ్యా ( 9), రవీంద్ర జడేజా(12)ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, ముహమూద్ చెరో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతల్ కు చెరొక వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జోస్ బుట్లర్, జాకోబ్ బెతల్ లు హాఫ్ సెంచరీలు చేశారు. ఫిల్ సాల్ట్ 43 పరుగులు చేశాడు.
భారత అరంగేట్ర బౌలర్ హర్షత్ రాణాకు మూడు వికెట్లు దక్కాయి. శుభమన్ గిల్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.