అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విశేష నిర్ణయం తీసుకున్నారు. బాలికలు, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడానికి అవకాశాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. పుట్టుకలో ఆడవారై ఉంటే మాత్రం వారికి అవకాశం ఉంటుంది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వనిధులను నిలిపివేస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.
‘‘ఇకపై మహిళల క్రీడలు కేవలం మహిళలకే. మహిళల క్రీడల మీద యుద్ధం ముగిసింది’’ అని ట్రంప్ ప్రకటించారు. ‘మహిళల క్రీడల్లోనుంచి పురుషులను దూరంగా ఉంచడం’ అనే పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘‘ఈమధ్య చాలా విద్యాసంస్థలు, క్రీడా అసోసియేషన్లు మహిళల క్రీడల్లో పోటీ పడడానికి మగవారిగా పుట్టిన ట్రాన్స్జెండర్లను సైతం అనుమతిస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య మౌలికమైన తేడాలను విస్మరించడం వల్ల బాలికలకు, మహిళలకు విద్యాపరమైన సదుపాయాల్లో అర్ధవంతమైన అవకాశాలు లేకుండా పోతున్నాయి. అది బాలికలు, మహిళలకు అవమానకరం, అన్యాయం, ప్రమాదకరం కూడా. ట్రాన్స్జెండర్లను మహిళల కేటగిరీలో అనుమతించడం అనేది క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభ చూపించేందుకు బాలికలు, మహిళలకు సమాన అవకాశాలను నిరాకరించడమే. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న విద్యాసంస్థలు, క్రీడల్లో పాల్గొనేందుకు మహిళలు, బాలికలకు ఉండే సమాన అవకాశాలను నిరాకరించలేవు. స్త్రీ పురుషుల మధ్య మౌలికమైన తేడాలను విస్మరించడం వల్ల బాలికలకు, మహిళలకు విద్యా సదుపాయాల్లో అర్ధవంతమైన అవకాశాలు లేకుండా పోతున్నాయని కొన్ని న్యాయస్థానాలు గుర్తించాయి’’ అని వైట్‌హౌస్ నుంచి జారీచేసిన ప్రకటనలో స్పష్టం చేసారు.
‘‘బాలికలు, మహిళలకు న్యాయబద్ధమైన క్రీడా అవకాశాలను లేకుండా చేసే విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు అన్నీ రద్దయిపోతాయి. బాలికలు, మహిళలకు ప్రమాదం కలిగించేలాంటి, అవమానం కలిగించేలాంటి, వారి గోప్యతకు భంగం వాటిల్లేలాంటి కార్యక్రమాలను విద్యాసంస్థలు చేపడితే వాటికి నిధులు ఆగిపోతాయి. మహిళల క్రీడల్లో మగవాళ్ళు పోటీ పడడానికి అవకాశం కల్పించడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది’’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది.
ట్రాన్స్జెండర్లుగా మారిన పురుషులు వివిధ క్రీడాపోటీల్లో మహిళా విభాగాల్లో పాల్గొనడం, నిజమైన క్రీడాకారిణులను ఓడించడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. అమెరికాలోని 25 రాష్ట్రాలు ఇప్పటికే హైస్కూల్, యూత్ లెవెల్ క్రీడాపోటీల్లో మహిళల కేటగిరీలో ట్రాన్స్జెండర్లు పాల్గొనడాన్ని నిషేధిస్తూ చట్టాలు చేసాయి.