బుధవారం జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 186మంది ముఖాల్లో ఆనందం నింపాయి. మొదటిసారి ఓటు వేసిన వారు కొత్తగా ఓటుహక్కు వచ్చిన 18ఏళ్ళ యువతరం కాదు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఇటీవలే భారతదేశ పౌరసత్వం లభించినవారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాకిస్తాన్ నుంచి పారిపోయి శరణార్థులుగా భారతదేశానికి వచ్చి ఢిల్లీలో శరణార్థి శిబిరాల్లో బతుకు ఈడుస్తూ వచ్చినవారు.
ఈమధ్యే సీఏఏ చట్టంతో ఈ శరణార్థుల ఉనికికి ఓ గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వల్ల ఓటు హక్కు వచ్చింది, ఆ హక్కును మొదటిసారి వాడుకున్న సంతోషం వారి ముఖాలను వికసింపజేసింది. ఓటు వేయడం వారికి కేవలం తమ ప్రతినిధిని ఎన్నుకోవడం మాత్రమే కాదు, తాము ఈ గడ్డకు చెందిన వారమనే అస్తిత్వాన్నిచ్చింది. చట్టబద్ధమైన గుర్తింపు కోసం యేళ్ళ తరబడి చేసిన పోరాటం ఫలించిందనడానికి నిదర్శనంగా నిలిచింది.
మజ్నూ కా టిల్లా ఢిల్లీలోని ఒక శరణార్థి శిబిరం. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో, కొత్తగా పౌరసత్వం లభించిన శరణార్థులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈవీఎం మీది బటన్‌ను నొక్కుతూ 50ఏళ్ళ రేష్మా గర్వంతో ఉప్పొంగిపోయింది. ‘‘నా జీవితంలో మొదటిసారి, నా భవిష్యత్తు గురించి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ ఓటు నా ఒక్కదాని కోసమే కాదు, నా కుటుంబంలో రాబోయే తరాల కోసం కూడా’’ అని ఆమె చిరునవ్వులు చిందించింది.
పాకిస్తాన్‌లోని వేలాది హిందువులు దశాబ్దాల తరబడి భారత్‌కు పారిపోయి వస్తున్నారు. మతపరమైన ఊచకోత, వివక్ష, హింసాకాండ నుంచి తప్పించుకోడానికి వారు మాతృదేశానికే శరణార్థులుగా వచ్చారు. వారిలో అత్యధికులు ఢిల్లీ రోడ్ల పక్కన తాత్కాలిక షెల్టర్లలో బతుకుతున్నారు. రోజుకూలీలుగా పనిచేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. తమకొక దేశం లేకపోయిన ఆవేదనలో యేళ్ళకేళ్ళు గడిపారు. చట్టబద్ధమైన గుర్తింపు లేకపోవడంతో వారికి కనీస హక్కులకు దిక్కు లేదు, సమాజసేవ వారికి అందదు, వారి భద్రతకు పూచీ లేదు. కానీ 2023 మార్చి 11న వారి తలరాతలు మారిపోయాయి. ఆ రోజు నుంచీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019ను అమల్లోకి తీసుకొచ్చింది.
కొత్త చట్టం ప్రకారం… 2014 డిసెంబర్ 31కి ముందు అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి ఏ పత్రాలూ లేకుండా వలస వచ్చిన ముస్లిమేతరులు భారతదేశ పౌరసత్వానికి అర్హులు. దశాబ్దాల అనిశ్చితి తర్వాత వారు ఎట్టకేలకు తమను దత్తత తీసుకున్న దేశంలో చట్టబద్ధమైన పౌరులుగా గుర్తింపు పొందారు. ఆ గుర్తింపు వల్ల తమకు కలిగిన హక్కే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయగలగడం. అందుకే ఆ రోజు వారికి ఎంతో ఉద్వేగకరమైన రోజుగా మిగిలిపోయింది.
45ఏళ్ళ చంద్రమ్మ భారతదేశంలో 17ఏళ్ళుగా నివసిస్తోంది. బుధవారం ఓటువేసిన తర్వాత ఆమె కన్నీటికి ఆనకట్ట పడడం లేదు. ‘‘ఎట్టకేలకు ఇన్నాళ్ళకు హిందుస్తాన్‌లో నేనూ ఒక భాగస్వామిని. ఈ క్షణం కోసమే నేను ఎన్నోయేళ్ళుగా ఎదురు చూసాను’’ అంటూ ఆనందబాష్పాలు రాల్చింది.
శరణార్థుల దశ నుంచి పౌరులుగా మారిన ఈ ప్రజలు, తమ ఓటుహక్కును మొదటిసారి వినియోగించుకోడం కోసం పోలింగ్‌కు ఇంకా చాలా గంటల సమయం ఉండగానే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. వందలాది పాకిస్తానీ హిందూ శరణార్థులకు నివాస స్థానమైన మజ్నూ కా టిల్లాలో వాతావరణం ఆశలూ, ఆకాంక్షలూ, ఉద్వేగాలతో నిండిపోయింది.
పాకిస్తానీ హిందూ శరణార్థుల సంఘం అధ్యక్షుడు ధరమ్‌వీర్ సోలంకీ, భవిష్యత్తు గురించి ఆశాభావం వ్యక్తం చేసారు. ‘‘ఎన్నోయేళ్ళుగా మేము బైటివారిగా జీవించాం. ఎప్పుడు ఎవరు వచ్చి ఖాళీ చేయించేస్తారో అని అనుక్షణం భయపడుతూ బతికాం. ఏ పూట తిండి ఆ పూట సంపాదించుకోడానికి కష్టపడ్డాం. ఇప్పుడు ఈ పౌరసత్వంతో మాకు స్థిరత్వం వచ్చింది. శాశ్వతమైన ఇళ్ళు, ఉద్యోగాలు, ఆత్మగౌరవంతో కూడిన బతుకు వచ్చాయి’’ అని సంతోషిస్తున్నారు.
కొత్తగా పౌరసత్వం రావడం బాగుంది, కానీ చాలామంది శరణార్థులు ఇంకా చాలా సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. వారికి స్వచ్ఛమైన తాగునీరు లేదు, విద్యుత్ సబ్సిడీలు లేవు, సరైన నివాసాలు లేవు, ఉద్యోగావకాశాలు అసలే లేవు. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి మరీ ఓటు వేసిన మైనా తన ఆందోళనల గురించి బైటకే చెప్పుకుంది. ‘‘ఈ దేశ పౌరసత్వం వచ్చాక కూడా, మేమింకా మిగిలిన వాళ్ళకంటె ఎక్కువ విద్యుత్ బిల్లులు కడుతున్నాము. మా ఇళ్ళన్నీ శిథిలమైపోయాయి. చాలా కఠోరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాము. రాబోయే కొత్త ప్రభుత్వమైనా మా గోడు వింటుందని, మా పరిస్థితిని మెరుగుపరుస్తుందనీ ఆశిస్తున్నాం’’ అని కోరుకుంది.
‘‘నేను నా జీవితమంతా కష్టాలే అనుభవించాను. నీటి కోసం, ఉద్యోగం కోసం, ఉనికి కోసం ఘర్షణ పడుతూనే ఉన్నాను. మాలో చాలామందికి ఇంకా ఆధార్ కార్డులు లేవు. ధరలు పెరిగిపోతున్నాయి. మేం ఏదో బతకడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చింది.
అన్ని సవాళ్ళ మధ్యా రంజూ నిటారుగా, గర్వంగా నిలబడి ఉంది. ‘‘ఇవాళ నేను ఓటు వేయగలిగాను. నేను వేచి చూస్తున్న మిగతా హక్కులు బహుశా రేపు పొందుతాను’’ అంటూన్న రంజూ చేతివేలి మీద సిరాచుక్క ఆమెకు కొత్తగా లభించిన అస్తిత్వానికి చిహ్నంగా మెరుస్తోంది.