ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్ధులకు ఉచిత మధ్నాహ్నం భోజనానికి ఇక నుంచి సన్న బియ్యం మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎమ్‌ఈ పాలసీల్లో కీలక మార్పులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2019 ముందు నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదించింది. ఏప్రిల్ నెలలో మత్సకార భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. వేసవి సెలవులు ముగిసే సమయానికి డీఎస్సీ పూర్తి చేయాలని నిర్ణయించారు.
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేందుకు నూతన పాలసీకీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కుదిరితే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కోరారు.
తిరుమల లడ్డూ కేంద్రంలో పనిచేస్తోన్న 15 మందికి సూపర్‌వైజర్ కేటగిరీలోకి మార్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది. వచ్చే మూడు నెలల్లో తల్లికి వందనం, అన్నదాన సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.
క్యాబినెట్ సమావేశం తరవాత మంత్రులతో సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్చించారు. వచ్చే మూడు నెలలపాటు ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
పారిశ్రామికవేత్తలకు రాయితీలతో కూడిన పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొత్త టెండర్లు పిలవాలని క్యాబినెట్ ఆమోదించింది. పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవనున్నారు.
విశాఖ గాజువాక పరిధిలో 1000 గజాల్లోని నిర్మాణాలను క్రమబద్దీకరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. 150 గజాల వరకు ఉచితంగా తరవాత స్లాబ్ విధానంలో క్రమబద్దీకరణ చేస్తారు. పట్టాదారు పాసుపుస్తకాలపై కూడా క్యాబినెట్ మార్పులను ఆమోదించింది.
అమరావతి రాజధానిలో 46 వేల కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్ల శాఖలో డైనమిక్ విధానం తీసుకురావడానికి మంత్రివర్గం #apcabinet ఆమోదం తెలిపింది. చెన్నై బెంగళూరు కారిడార్‌లో భూములు కోల్పోతున్న తిరుపతి జిల్లా కొత్తపట్నం ప్రాంత రైతులకు ఎకరాకు రూ.8 లక్షల పరిహారం చెల్లించడానికి నిధులు విడుదలకు అంగీకరించారు.మధ్య దుకాణాలు బేవరేజస్‌కు చెల్లిస్తోన్న 10శాతం కమీషన్ 14 శాతానికి పెంచారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆదేశాలు జారీ చేశారు.