అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూసుకెళుతున్నారు.సరైన పత్రాలు లేని వలసదారులను వెనక్కిపంపడంతో పాటు పనామా కాలువ విషయంలోనూ పంతం నెగ్గించుకున్నారు.
పనామా కాలువను కొనుగోలు చేయాలని గతంలో ట్రంప్ భావించారు. కానీ అది కార్యరూపందాల్చకముందే ఆయన పదవిని కోల్పోయారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఈ సారి కచ్చితంగా పనామా కాలువను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అవసరమైతే సైనిక చర్యతో పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకొంటామని హెచ్చరించారు.
ట్రంప్ హెచ్చరికతో పనామా వెనక్కి తగ్గింది. అమెరికా యుద్ధ నౌకలు ఎలాంటి రుసుములూ చెల్లించకుండానే పనామా కాలువపై నుంచి ప్రయాణించేందుకు అంగీకరించింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ మధ్య ఒప్పందం జరిగింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో ప్రకటన కూడా చేసింది.
అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయంతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించేది. దీనిపై పనామా దేశంలో అసంతృప్తితో ఘర్షణలు చెలరేగాయి. దాంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్, కాల్వ నిర్వహణను పనామాకు అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండటంతో ఎలాంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉందని పేర్కొంది. పనామా కూడా ఈ కాల్వ కోసం భారీగా వెచ్చించింది.