చైనా తయారీ డీప్ సీక్ యాప్ వినియోగంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమెరికా నిషేధించిన చైనా టెలికాం సంస్థతో డీప్ సీక్ కలసి పనిచేస్తోందని వెల్లడైంది. డీప్ సీక్ వినియోగదారుల నుంచి సేకరించిన వ్యక్తిగత వివరాలు చైనా టెలికాం సంస్థకు అందజేస్తోందని ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించాయి. తాజాగా దక్షిణ కొరియా డీప్ సీక్ వినియోగాన్ని నిషేధించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తిగతంగా ఉపయోగించే వారు డీప్ సీక్ సేవలు వినియోగించరాదని ఆదేశించింది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, తైవాన్, ఇటలీ దేశాలు డీప్ సీక్‌పై నిషేధం విధించాయి. తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా చేరింది. దీంతో ఏఐకు పోటీగా దూసుకువచ్చిన డీప్ సీక్ వినియోగంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తక్కువ ఖర్చుతో రూపొందించిన డీప్ సీక్ ఇటీవల కాలంలో సంచలనంగా మారింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టే స్టోర్లలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా డీప్ సీక్ నిలిచింది.
వ్యక్తిగత వివరాలకు రక్షణ లేకపోవడం, లాగిన్ వివరాలు చైనా టెలికం సంస్థకు చేరవేస్తోందనే అనుమానాలతో డీప్ సీక్‌పై నిషేధాలకు దారితీస్తోంది. దీనిపై డీక్ సీక్ ఇంత వరకు స్పందించలేదు. మరికొన్ని దేశాలు కూడా డీప్ సీక్‌ను నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్ స్వయంగా ఏఐ ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది కాలంలో అది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని టెక్ దిగ్గజాలు చెబుతున్నాయి.