ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నామసంకీర్తన
ఫిబ్రవరి 12న అలిపిరి వద్ద మెట్ల పూజ
ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి
టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11, 12న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు వివరిస్తారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఫిబ్రవరి 13న ఉదయం 8.30 గంటలకు సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9.30 గంటల నుండి స్వామిజీలు ధార్మిక సందేశం ఇవ్వనున్నారు.
ఫిబ్రవరి 12న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
పూర్వం మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి స్వామిని సేవించారు.వారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవాన్ని ‘ దాస సాహిత్య ప్రాజెక్టు’నిర్వహిస్తోంది.
సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
తిరుమలలో ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి
కలియుగ వైకుంఠం తిరుమలలో ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగనుంది.
ప్రతి ఏటా మకరమాసంలో ఈ క్రతువు నిర్వహిస్తారు. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఎవరైనా మానవులు తల్లిదండ్రులను, గురువులను దూషించడంతో కలిగే దోషము, ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుటతో తొలుగునని ప్రాశస్త్యం.