బంగారం అక్రమ రవాణాను దిల్లీ కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు పదికిలోల బంగారు నాణెలను రహస్యంగా విదేశాల నుంచి తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
ఇద్దరు వ్యక్తులు నడుముకు ధరించే బెల్టులో రహస్యంగా బంగారు నాణాలు దాచి
ఇటలీలోని మిలాన్ నుంచి దిల్లీ వచ్చారు. దిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. లగేజీ తనిఖీ చేసినా ఏమీ కనిపించలేదు. దీంతో మళ్ళీ తనిఖీలు చేయగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్టులు కనిపించాయి. వాటిలో రహస్యంగా దాచిన బంగారు నాణాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. వాటి బరువు లెక్కగట్టగా 10.092 కిలోలు ఉన్నాయని, మార్కెట్ లో ఆ నాణాల విలువ రూ.7.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
నాణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి, ప్రయాణికులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడిన వారు కశ్మీర్ కు చెందిన వారని అధికారులు తెలిపారు.