ఈ యేడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత హింసలో మొత్తం 31 రోజులకు గానూ 3 మరణాలే నమోదయ్యాయి. గత ఇరవై ఏళ్ళలో ఏదైనా ఒక నెలలో ఇంత తక్కువ హింస జరగడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితం జమ్మూ ప్రాంతం పూంఛ్ జిల్లాలో, భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. అంతకు ముందు వారంలో కశ్మీర్ ప్రాంతంలోని సోపోర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యానికి చెందిన ఒక జవాను అమరుడయ్యారు.
జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అంతటా భద్రతా బలగాల పహరా పెంచడం, ఇంటలిజెన్స్ నెట్వర్క్ మెరుగు పడడమే ఈ ఘనతకు కారణాలయ్యాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అతితక్కువ మరణాలు నమోదైన నెల అని భారత సైన్యానికి చెందిన ఒక అధికారి వెల్లడించారు. గతేడాది జనవరిలో కూడా ముగ్గురే మరణించారు. వారిలో ఇద్దరు భద్రతా బలగాలకు చెందిన వారు, ఒక ఉగ్రవాది. ఇప్పుడా పరిస్థితి తిరగబడింది పైగా, మృతుల్లో సాధారణ భారతీయ పౌరులు ఎవరూ లేకపోవడం విశేషం. గత ఐదేళ్ళ అధికారిక సమాచారాన్ని విశ్లేషిస్తే ఏ యేడాదిలోనూ జనవరి నెలలో సామాన్య పౌరులు చనిపోలేదు.
పౌరుల మరణాలు గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం, భారతీయ భద్రతా బలగాలు పెద్దసంఖ్యలో మోహరించిన మారుమూల ప్రాంతాలకు ఉగ్రవాదులను తరిమికొట్టడమే అని ఆర్మీ అధికారి చెప్పారు. అంతేకాదు, 2017 నుంచీ సమాచారాన్ని గణిస్తే, ఉగ్రవాదులను హతమారుస్తున్న సంఘటనలే అధికంగా ఉండడం, ఒక స్పష్టమైన విధానాన్ని ప్రజలకు చూపిస్తోందని ఆ అధికారి చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో భద్రతా నిఘా పెంచడం వల్ల అక్కడ శాంతిభద్రతల పరిస్థితి నిలకడగా ఉందని ఓ భద్రతా అధికారి వెల్లడించారు. ఎలాంటి ఎన్కౌంటర్లోనూ సామాన్య పౌరులు లేదా భద్రతా బలగాలూ ప్రాణాలు కోల్పోకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ఆపరేషన్లు చేపట్టడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. జమ్మూకశ్మీర్‌ను ఉగ్రవాద విముక్త ప్రాంతంగా మార్చడానికి అన్నిరకాల వనరులనూ అందిస్తామని వెల్లడించింది. సరిహద్దుల వెంబడి సీసీ కెమెరాలతో నిఘా, డ్రోన్ జామర్ల వినియోగం వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగించడం కూడా సత్ఫలితాలను ఇస్తోందని భారత సైన్యపు అధికారి ఒకరు స్పష్టం చేసారు.