వేల యేళ్ళ క్రితం విలసిల్లిన సింధులోయ నాగరికత ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటి. ఆ నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పుడు అక్కడ జనాభా 50లక్షల పైమాటే అని అంచనా. ఆనాటి అద్భుతమైన నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు ఈనాటికీ విస్మయపరుస్తున్నాయి. అయితే సింధులోయ ప్రజలు వాడిన లిపిని అర్ధం చేసుకోవడం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. దాంతో ఆనాటి ప్రజల భాష నేటికీ తెలియకుండానే ఉండిపోయింది. భారతదేశపు అతిగొప్ప రహస్యంగా మిగిలిపోయిన ఆ లిపి గుట్టు విప్పితే మిలియన్ డాలర్ల పురస్కారం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
సింధులోయ నాగరికత పూర్వసామాన్యశకం 1900 దరిదాపుల్లో ఒక్కసారిగా పతనమైపోయింది. దానికి కారణాలు ఏమిటో తెలియరాలేదు. సింధు నాగరికత శాసనాల్లో రాళ్ళు, మృణ్మయ పాత్రల మీద కొన్ని చిహ్నాలు, సంకేతాలూ లభించాయి. వాటిలో ఉన్న క్రమబద్ధత వల్ల అవి ఒక నిర్దిష్టమైన లిపిలో భాగమని అర్ధమవుతోంది. అవి నిజమైన భాషను ప్రతిఫలిస్తున్నాయా అన్న అంశంపై వాదోపవాదాలు ఉన్నాయి. ఇప్పటివరకూ సుమారు 400 విభిన్నమైన చిహ్నాలు, సంకేతాలు కనుగొన్నారు. వాటిని డీకోడ్ చేసి ఆ లిపిని, భాషను కనుగొనే వారు మిలియన్ డాలర్ల రివార్డు గెలుచుకోగలరని తమిళనాడులోని ద్రవిడ ప్రభుత్వం ప్రకటించడం ఆసక్తికరం.
దేశానికి స్వతంత్రం రావడానికి ముందునుంచే మన చరిత్రకు మసిపూసే కార్యక్రమం మొదలైంది. అందులో భాగంగానే ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం వ్యాప్తిలోకి వచ్చింది. కొన్నాళ్ళ క్రితం ఆ సిద్ధాంతం అడుగు ఊడిపోవడంతో ఆర్యుల వలస సిద్ధాంతాన్ని తయారుచేసారు. ఆర్యులు ఎక్కడినుంచో వచ్చి భారతదేశాన్ని ఆక్రమించారనీ, సంస్కృతం ఈ దేశపు భాష కాదనీ, అసలు ఈ దేశపు మూలనివాసులు ద్రవిడులనీ, వారి భాషా సంస్కృతులే సింధు, హరప్పాలలో వెలుగుచూసాయనీ ఎలాగైనా ఒప్పించాలన్నది భారత వ్యతిరేకుల ప్రయత్నం. దానికి తమిళనాడులోని ద్రవిడ పార్టీల అండ ఉంది.
ఆ క్రమంలోనే సింధులోయలో బైటపడిన చిహ్నాల మీద లిపిని, అక్షరాలను నేటి తమిళ లిపి, భాషకు మూలాలుగా గుర్తింపజేయాలనేది వారి ప్రయత్నం. విచిత్రం ఏమిటంటే ద్రవిడ లిపి, సంస్కృత భాష లిపులలో ఒకటైన బ్రాహ్మీ లిపి నుంచే వచ్చిందని స్పష్టంగా తెలుస్తున్నా ఆ ఆధారాలూ, విశ్లేషణల గురించి నోరెత్తడం లేదు. ద్రవిడ (తమిళ) లిపి భాషా సంప్రదాయాలే సింధులోయకు చెందిన లిపి భాషా సంప్రదాయాలకు మూలాధారం అని నిరూపించాలన్నది వారి తపన. అందుకే తమిళ లిపి ఆధారంగా సింధు లిపిని డీకోడ్ చేయాలని డిఎంకె ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
నిజానికి సింధులిపిని డీసిఫర్ చేయడానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిశోధనల్లో కొంతమంది నిజాయితీగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సంస్కృతం మూలభాషగా సింధులిపిని డీసిఫర్ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కానీ అలాంటి పరిశోధనలను దురుద్దేశపూర్వకంగా బైటకు రానీయడం లేదు. ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు, వాటి ఫలితాలూ బైటపడుతున్నాయి. దాంతో భారతదేశపు ప్రాచీనతను, సంస్కృత భాష ప్రాచీనతనూ ఒప్పుకోవలసిన గతి పట్టేలా ఉంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోడమే లక్ష్యంగా, భారతదేశపు సనాతన సంస్కృతీ సంప్రదాయాలను గుడ్డిగా వ్యతిరేకించే తమిళనాడులోని ద్రవిడవాద డీఎంకే ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.