ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలోనూ చికిత్సకు అనుమతి
‘గడప గడపకు మన ప్రభుత్వం’నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో భాగంగా తెలంగాణలోనూ చికిత్స కు అనుమతి ఇచ్చింది. ఇక గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ‘గడప గడపకు’ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలులో భాగంగా తెలంగాణలోనూ చికిత్సకు అనుమతించింది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు అనుమతి మంజూరు చేసింది. రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
తెలంగాణలో వైద్యం చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పింఛనుదారులు బిల్లులు రీయింబర్స్ కాక నష్టపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర విభజన అనంతరం కొందరు ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. వీరికి ఈ నిర్ణయంతో మేలు జరగనుంది.
‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిలిపివేత
గత ప్రభుత్వం హయాంలో ఎన్నికలకు ఏడాది ముందు అమలైన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.