తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారుణానికి పాల్పడ్డారు. కృష్ణగిరి జిల్లాలో 13 సంవత్సరాల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన 13 సంవత్సరాల విద్యార్ధిని నెల రోజులుగా బడికి రావడం లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుడు కొంతమంది విద్యార్ధులను వెంటబెట్టుకుని విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చిందని అబార్షన్ చేయించడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు బాలిక తల్లి చెప్పడంతో ప్రధానోపాధ్యాయులు నివ్వెరపోయారు.వెంటనే బాలికల సంరక్షణా అధికారికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు బాలికను విచారించడంతో ఉపాధ్యాయులు అరాచకం వెలుగులోకి వచ్చింది.
బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులు చిన్నస్వామి, ప్రకాశ్, ఆరుముగంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.