పేరు ‘ఆమ్ ఆద్మీ’ అని పెట్టుకుని నిజమైన సామాన్యుడికి ‘ఖాస్ ఆప్దా’గా (ప్రత్యేకమైన ఆపద) మారిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి దేశ రాజధాని శాసనసభలో పరాభవం కలగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో పాతికేళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీలో అధికారం కోసం ఎదురుచూస్తున్న కాషాయ పార్టీకి పరిపూర్ణ విజయం కాకుండా సాధారణ మెజారిటీ మాత్రమే వస్తుందని చాలావరకూ సర్వే సంస్థలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌కు మాత్రం చిరునామా గల్లంతే అంటున్నాయి.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5గంటల వరకూ 57.70శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి కనీసం 36 స్థానాలు గెలుచుకోవాలి.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ బీజేపీ 51-60 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని అంచనా వేస్తోంది. ఆప్ 10-19 స్థానాలకు పరిమితం కావచ్చు. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఈ సంస్థ అంచనా.
పోల్ డైరీ ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం బీజేపీ 42-50 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఆప్ 18-25 సీట్లు పొందవచ్చు. కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 2 స్థానాలు రావచ్చు.
పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్‌పోల్ అంచనా ప్రకారం బీజేపీకి 40-44 స్థానాల్లో దక్కవచ్చు. ఆప్ 25-29 సీట్లు పొందవచ్చు. కాంగ్రెస్‌కు గరిష్ఠంగా ఒక సీటు రావచ్చు.
జేవీసీ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 39-45 సీట్లలో గెలుపు దక్కవచ్చు, ఆప్ 22-31 స్థానాలకు పరిమితం కావచ్చు, కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 2 స్థానాలు రావచ్చు.
పి-మార్క్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ ప్రకారం బీజేపీ 39-49స్థానాలు గెలుచుకుంటుంది. ఆప్ 21-31 స్థానాలు దక్కించుకుంటుంది. కాంగ్రెస్ గరిష్ఠంగా ఒక్క స్థానం సంపాదించుకుంటుంది.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 39-44 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఆప్ 25-28 సీట్లతో వెనుకబడవచ్చు. కాంగ్రెస్‌కి 2-3 సీట్లు దక్కవచ్చు.
డీవీ రిసెర్చ్ అంచనాల ప్రకారం బీజేపీ 36-44 స్థానాలు గెలుచుకునే అవకాశముంది. ఆప్ 26-34 సీట్లు పొందవచ్చు. కాంగ్రెస్ మాత్రం ఖాతా తెరవలేదు.
మాట్రిజ్ సంస్థ ఎగ్జిట్‌పోల్ అంచనాల ప్రకారం బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. కాషాయ పార్టీ 35-40 స్థానాలు గెలుచుకోవచ్చు, ఆప్ 32-37 స్థానాలు దక్కించుకోవచ్చు. కాంగ్రెస్‌కు ఒక సీటు రావచ్చు.
వీ ప్రిసైడ్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉంది. వారి అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 46-52 సీట్లు గెలుచుకోవచ్చు. బీజేపీ 18-23 సీట్లకు పరిమితం కావచ్చు. కాంగ్రెస్‌కు గరిష్ఠంగా ఒక సీటు రావచ్చు.
మైండ్ బ్రింక్ సంస్థ కూడా కేజ్రీవాల్ పార్టీకే పట్టం కట్టింది. వారి అంచనాల ప్రకారం ఆప్‌కు 44-49 సీట్లు రావచ్చు. బీజేపీ 21-25 స్థానాలకు పరిమితం కావచ్చు. కాంగ్రెస్ గరిష్ఠంగా ఒక్క స్థానం దక్కించుకోవచ్చు.
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. అంతకుముందు మూడుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. పాతికేళ్ళ నుంచీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఈసారైనా విజయం సాధించాలని తహతహలాడుతోంది.