కర్ణాటక ప్రభుత్వం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్రం అప్పు ఇప్పటికే రూ.6లక్షల కోట్లు దాటిపోయింది. మార్చి 31 నాటికి రూ.6.65 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంత భారీ అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిర్వహణ ఎలా, ప్రభుత్వ విధానాల భారం మోయడం ఎలా, ఓటర్లను ఆకట్టుకోడానికి చేసిన ఉచిత వాగ్దానాల అమలును కొనసాగించడం ఎలా అన్నవి పెద్ద సందేహాలుగా మిగిలిపోయాయి.
కర్ణాటక ఆర్థిక ఆరోగ్యం పరమ దరిద్రంగా ఉందని గణాంకాలే చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.5.80 లక్షల కోట్లకు పెరిగింది. ఇక 2024-25 సంవత్సరంలో మరో రూ.1.05 లక్షల కోట్ల ఋణం మీద పడింది. ఇందులో ప్రమాదకరమైన విషయం ఏంటంటే మొత్తం ఖర్చులో దాదాపు 60శాతం, అంటే రూ.62,552 కోట్లు ఋణం కేవలం అప్పులు, వడ్డీలు తీర్చడానికే కేటాయించారు. అంటే బడ్జెట్లో మెట్టువాటా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాలు లేదా ఆర్థికాభివృద్ధికి కీలకమైన అవసరాలకు కాకుండా కేవలం అప్పులు తీర్చడానికే వాడాల్సి వస్తోందన్నమాట.
2024-25 సంవత్సరానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూ.3.71లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌లో పెద్దమొత్తాన్ని ఋణాల చెల్లింపులకే కేటాయించాల్సి రావడంతో రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు సొమ్ములు సాధించే విషయంలో ప్రభుత్వ సమర్ధత మీద అనుమానాలు తలెత్తుతున్నాయి.
వార్షిక వడ్డీ చెల్లింపుల వ్యయమే కొండంత ఉంది. వచ్చే యేడాది కర్ణాటక ప్రభుత్వం రూ.37,324కోట్లు కేవలం వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. దాన్నిబట్టే, నిధులు వ్యయం చేసే విషయంలో కర్ణాటక సర్కారు వ్యూహాల మీద నైతిక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి గత కొద్ది నెలల్లో ప్రవేశపెట్టిన లేక విస్తరించిన సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఖజానా మీద మోపే భారం అలవిమాలినదిగా ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
అప్పు చేయగల ఋణ పరిమితి జీడీపీలో 25శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక ఇప్పటికే రూ.59వేల కోట్లు ఋణాలు తీసుకుంది. అందులో ఎక్కువ వాటా రాబోయే త్రైమాసికాలదే. అంటే భవిష్యత్తులో చేయగల అప్పులను కూడా ముందుగానే తీసేసుకుందన్నమాట. రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ మీద ఈ ఋణ భారం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలూ ప్రకటించడం రాష్ట్ర ఖజానా మీద మోయలేని భారం మోపింది. ఆర్థిక స్థిరత్వం లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం మీద అప్పుల భారం రూ.6.65 లక్షల కోట్లకు చేరుకోవడంతో రాష్ట్రంలోని ఒక్కో పౌరుడి మీదా సుమారు లక్ష రూపాయల ఋణభారం మోపినట్లయిందని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఆర్ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కర్ణాటక రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించడమే కాంగ్రెస్ ప్రభుత్వం అజెండాగా పెట్టుకున్నట్లుందని మండిపడ్డారు.