రాజ్యాంగబద్ధమైన పరిమితులకు లోబడి భావప్రకటనా స్వేచ్ఛను ఎవరైనా వ్యక్తీకరించుకోవచ్చునంటూ మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని షరతులకు లోబడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోడానికి హిందూ మున్నాని సంస్థకు అనుమతినిచ్చింది.
తిరుప్పరకుండ్రం ఆలయాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించుకోడానికి అనుమతి కోరుతూ ఎం మురుగన్, పి సుందర వడివేల్, హిందూ ధర్మ పరిషత్ పిటిషన్లు దాఖలు చేసారు. తమ కార్యక్రమాన్ని నిర్వహించుకోడానికి వీల్లేదంటూ పోలీసులు విధించిన సెక్షన్ 144ను తొలగించాలని కోరారు. మద్రాసు హైకోర్టులో జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ ఆర్ పూర్ణిమలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లను విచారించింది.
ప్రతీ ఒక్కరికీ తమ భావాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ఉందన్న హైకోర్టు డివిజనల్ బెంచ్, హిందూ మున్నాని తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి కొన్ని పరిమితులు విధించింది. ఫిబ్రవరి 4 సాయంత్రం 5నుంచి 6గంటల వరకూ పళంగనాథమ్ జంక్షన్ దగ్గర ఆందోళన నిర్వహించుకోవచ్చునని అనుమతించింది. ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నిర్వాహకులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. నిర్వాహకులు ఒకే ఒక మెగాఫోన్ ఉపయోగించాలని, ఆందోళన కార్యక్రమాన్ని వీడియో రికార్డ్ చేయాలనీ షరతులు విధించింది.
తిరుప్పరంకుండ్రంలో ఆలయ భూములు దురాక్రమణకు గురయ్యాయి. దేవాలయ భూములను దుర్మార్గంగా ఆక్రమించుకున్న వారిపై ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఆక్రమణదారుల దుశ్చర్యలకు, పోలీసుల అచేతనత్వానికీ వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని హిందూ మున్నాని సంస్థ నిర్ణయించుకుంది. తమ సంస్థ ఆందోళన కార్యక్రమానికి అనుమతి కోరుతూ హిందూ మున్నాని మదురై నగర విభాగం ప్రధాన కార్యదర్శి తిరుప్పరకుండ్రం ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాసారు. ఫిబ్రవరి 4న పదహారు కాళ్ళ మండపం దగ్గర మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9.45 వరకూ ఆందోళన చేపడతామని వివరించారు. దానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కథ అక్కడితో ఆగలేదు.
తిరుప్పరకుండ్రం పోలీసులు ఫిబ్రవరి 4న గుడికి వెళ్ళవద్దంటూ ఆ ఊరి పౌరులను ఉద్దేశించి ప్రకటన చేసారు. గుడి దగ్గరకు ఆందోళనలో పాల్గొనడానికి వాహనాలను సమకూర్చవద్దంటూ ఆటోలు, టాక్సీలు, ఇతర వాహనాల ఆపరేటర్లను హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ సిఫారసుతో జిల్లా కలెక్టర్ ఫిబ్రవరి 3,4 తేదీల్లో నిషేధాజ్ఞలు జారీ చేసారు. అలా, దేవాలయ ఆస్తుల ఆక్రమణ విషయంలో ఎవరూ నోరెత్తకుండా అణచివేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేసారు. దాంతో హిందూ మున్నాని బాధ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం, అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరకు ఇరుపక్షాలకూ రాజీ కుదిరింది. ఆందోళన చేసే ప్రదేశాన్ని తిరుప్పరంకుండ్రం ఆలయం నుంచి పళంగనాథమ్ జంక్షన్‌కు మార్చారు. కార్యక్రమాన్ని సుదీర్ఘంగా కాకుండా ఒకే ఒక్క గంట పాటు నిర్వహించడానికి నిర్వాహకులు ఒప్పుకున్నారు. ఆందోళనకారులకు సరైన ఏర్పాట్లు చేయడానికి పోలీసులు అంగీకరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసారు.
తిరుప్పరంకుండ్రం, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి (మురుగన్) సంబంధించిన ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి. ఆ ఆలయం ఉన్న కొండను ఆక్రమించడానికి ముస్లిములు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఒక దర్గా కట్టారు, అక్కడ మేకలు, కోళ్ళను బలి ఇస్తూ క్రమంగా ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. దాన్ని అడ్డుకోడానికే ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి హిందూ మున్నాని సభ్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.