జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ సీపీఐ (మావోయిస్టు)కు చెందిన నలుగురు ఓవర్‌గ్రౌండ్ కార్యకర్తలను మంగళవారం అరెస్ట్ చేసింది. ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలోని కుయేమారి ఏరియా కమిటీ కార్యకర్తలు ఆయుధాలు తీసుకుని వెడుతుండగా వారిని పట్టుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఇది తాజా పరిణామం. ‘అరెస్ట్ అయిన నిందితులందరూ సీపీఐ (మావోయిస్టు) నాయకులకు వీరాభిమానులు’ అని ఎన్ఐఏ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
అనీష్ ఖాన్, అనిల్ కుమార్ నేతమ్, జైసింగ్ హిడ్కో, రఘువీర్ అనే నలుగురు చాలాకాలంగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నారు. మావోయిస్టు కార్యకర్తలకు ఆశ్రయం ఇస్తున్నారు, వారికి రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు అని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
వసతి, రవాణా కల్పించడం మాత్రమే కాకుండా నిందితులు మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు, డెటొనేటర్లూ సరఫరా చేసారని కూడా వెల్లడించింది. అలా సమకూర్చిన ఆయుధాలతోనే మావోయిస్టులు కాంకేర్ జిల్లా ముజల్‌గోండీ గ్రామం దగ్గర పోలీసుల మీద దాడిచేసారని ఎన్ఐఏ కనుగొంది. ఆ దాడికి సంబంధించి ఇద్దరు సాయుధ మావోయిస్టులను పోలీసులు విజయవంతంగా నిర్బంధించారు కూడా.