లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్-చైనా సరిహద్దు వివాదం గురించి తప్పుడు వ్యాఖ్యలు, భారత ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసారంటూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు తీవ్రంగా విమర్శించారు.
‘‘ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుగా ప్రచారం చేసారు. భారత్ చైనా సరిహద్దుల వద్ద రెండు వైపులా సాధారణంగా చేపట్టే పహరా విధుల్లో అలజడి రేగిన సందర్భం గురించి ఆర్మీచీఫ్ మాట్లాడారు. ఇటీవల డిస్-ఎంగేజ్‌మెంట్‌లో భాగంగా మళ్ళీ పాత పద్ధతిలో పహరాను పునరుద్ధరించాము. ఆ వివరాలను ప్రభుత్వం పార్లమెంటులో కూడా వివరించింది’’ అని రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ చైనీస్ ఉత్పత్తులపై భారత్ ఆధారపడడం దేశ భద్రతకు గణనీయమైన ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసారు. భారత భూభాగంలో చైనీస్ బలగాలు ఉన్నాయని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఒప్పుకున్నారని కూడా రాహుల్ చెప్పుకొచ్చారు. ‘‘అది నిజం. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన భూభాగంలోకి చైనీస్ బలగాలు ఎందుకు చొరబడ్డాయి. ఎందుకంటే, మన ‘మేకిన్ ఇండియా’ ఘోరంగా విఫలమైంది. భారత్ తగినంత ఉత్పత్తి చేయడం లేదు కాబట్టే చైనా మన భూమిని ఆక్రమిస్తోంది. భారతదేశం ఈ పారిశ్రామిక విప్లవాన్ని మరోసారి చైనాకు అప్పగించేస్తోంది’’ అని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ ప్రకటనలను రాజ్‌నాథ్ సింగ్ తిరస్కరించారు. అంతేకాదు, ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు అంటూ రాహుల్ గాంధీ చెప్పిన మాటలను ఆర్మీచీఫ్ వాస్తవంలో ఏనాడూ మాట్లాడలేదని స్పష్టం చేసారు. ‘‘జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా రాజకీయాలు చేస్తుండడం దురదృష్టకరం’’ అని రాజ్‌నాథ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారత భూభాగంలో చైనా ఉనికి గురించి రాహుల్ గాంధీ చేసిన ప్రకటనల గురించి ప్రస్తావిస్తూ అలాంటి ఆక్రమణ గతంలో జరిగిందని గుర్తు చేసారు. 1962 యుద్ధం తర్వాత అక్సాయ్‌చిన్‌లో 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, 1963లో పాకిస్తాన్ చైనాకు అక్రమంగా ధారాదత్తం చేసిన 5180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్నీ మాత్రమే చైనా ఆక్రమించిందని స్పష్టం చేసారు.