మహాకుంభమేళా 2025లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తర్వాత సంగమక్షేత్రంలో పూజలు చేసారు.
ప్రయాగ చేరుకున్న ప్రధానమంత్రి మొదట ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి యమునా నదిలో పడవలో తిరిగారు. కాషాయ రంగు జాకెట్, నీలి రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి మోదీ త్రివేణీ సంగమ స్థానంలో పవిత్ర స్నానం చేసారు.
మహాకుంభమేళా పౌష్య పూర్ణిమ అంటే 2025 జనవరి 13న ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక, సాంస్కృతిక సమ్మేళనం అయిన కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినం వరకూ ఈ మేళా కొనసాగుతుంది.
భారతదేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, దానికి ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ సంకల్పం చెప్పుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన దేశంలోని పలు పుణ్యక్షేత్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, వసతికల్పనను మెరుగుపరచడానికీ నిబద్ధతతో పనిచేసారు.
మంగళవారం నాడు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్‌చుక్ కుంభమేళాలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి లేటే హనుమాన్ మందిర్ వద్ద పూజలు చేసారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు.
ఇవాళ ఉదయం 8గంటల సమయానికి సుమారు 38లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించారు. కుంభమేళా ప్రారంభమైన నాటినుంచి ఫిబ్రవరి 4 వరకూ 38కోట్ల 20లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు చేసారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.