అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మకమైన ప్రకటన చేసారు. గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. అక్కడ ప్రమాదకర ఆయుధాలను నాశనం చేస్తామని, ధ్వంసమైన భవనాలను తొలగిస్తామని చెప్పారు. ఆ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి పని చేస్తామని ప్రకటించారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అనంతరం ఇద్దరు నేతలూ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రస్తుతం అమలవుతున్న బందీల అప్పగింత – కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఆ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం మొదలైన సుదీర్ఘ ప్రయత్నానికి ప్రారంభమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘‘గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. మేం ఆ పని చేసి తీరతాం. గాజాను మా సొంతం చేసుకుంటాం. అక్కడ ఉన్న అన్ని ప్రమాదకరమైన, ఇంకా పేలకుండా ఉన్న బాంబులు, ఇతర ఆయుధాలను నాశనం చేస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగిస్తాం. అక్కడ ఆర్ధిక వాతావరణాన్ని సృష్టిస్తాం. తద్వారా అపరిమితమైన ఉద్యోగాలు కల్పిస్తాం, ఆ ప్రాంత ప్రజలకు గృహాలు నిర్మిస్తాం’’ అని ట్రంప్ చెప్పారు.
‘‘ఇప్పుడున్న కాల్పుల విరమణ మరింత పెద్దదీ, చిరకాలం శాంతిని కలిగించే ప్రక్రియకు ప్రారంభమని భావిస్తున్నాను. అక్కడ రక్తపాతానికీ, పరస్పర హననాలకూ ముగింపు పలకాలి. అదే లక్ష్యంతో మా ప్రభుత్వం వేగంగా పనిచేస్తుంది. కూటమిలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రాంతం అంతటా అమెరికా శక్తిని పునర్నిర్మిస్తాం’’ అని ట్రంప్ వివరించారు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్, యుఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ అనే రెండు సంస్థల నుంచీ అమెరికా వైదొలగుతోందని కూడా ట్రంప్ ప్రకటించారు.
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న ఇరాన్ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని, దానికోసం ఆ దేశం చమురు ఎగుమతులు చేయకుండా వారిపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ అన్నారు.
గాజా స్ట్రిప్ గురించి మాట్లాడుతూ ఆ ప్రాంతంలో పాలస్తీనాకు ఎలాంటి జోక్యం లేకుండా ఉండే భవిష్యత్తును సాకారం చేస్తామని ట్రంప్ అన్నారు. గాజా స్ట్రిప్ అమెరికా స్వాధీనమైతే మధ్యప్రాచ్యంలో సుదీర్ఘకాలం సుస్థిరత నెలకొంటుందని వ్యాఖ్యానించారు.
‘‘గాజాలో ఉండడానికి ప్రజలు మళ్ళీ వెనక్కి వెళ్ళరు. అది వారికి చాలా దురదృష్టకరమైనది. వాళ్ళు అక్కడ నరకంలో ఉన్నట్టు ఉండాలి. వాళ్ళు అక్కడికి మళ్ళీ వెళ్ళడానికి ఒకే ఒక కారణం వాళ్ళకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడమే. ఆ ప్రాంతాన్ని, ఇంకా మాట్లాడితే మధ్యప్రాచ్యం మొత్తాన్నీ, అమెరికా స్వాధీనం చేసుకుంటేనే అక్కడ సుస్థిరత నెలకొంటుంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆ దేశానికి వెళ్ళిన మొట్టమొదటి విదేశీ నాయకుడు బెంజమిన్ నెతన్యాహునే. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం వారిద్దరూ సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే గాజా స్ట్రిప్ గురించి ట్రంప్ మాట్లాడారు. గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను ట్రంప్ గతంలో కూడా వ్యక్తపరిచారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ ఖాళీ చేసేయాలనీ, అక్కడున్న పాలస్తీనియన్లను పొరుగు దేశాలకు తరలించాలనీ ఆయన వాదన.
మధ్యప్రాచ్యంలో అమెరికాకు ఆప్తమిత్రుడు జోర్డాన్ రాజు అబ్దుల్లా 2. ఆయనతో ట్రంప్ మొన్న శనివారం మాట్లాడారు. గాజాతో సరిహద్దులు కలిగి ఉన్న జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు పాలస్తీనా ప్రజలకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ సూచించారు.