దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 70 నియోజక వర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. పోలింగ్ ఈ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది.
ఢిల్లీలో మొత్తం కోటీ 56 లక్షల పైచిలుకు రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వారిలో 2.4లక్షల మంది మొదటిసారి ఓటుహక్కు పొందినవారు ఉన్నారు. ఈ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, హోంగార్డులు, ఢిల్లీ పోలీస్ సహా సుమారు లక్ష మంది ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు.
70 పోలింగ్ స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే ఉన్నారు. అలాగే మరో 70 పోలింగ్ స్టేషన్లలో దివ్యాంగులే విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో యువతరం పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా 70 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. అత్యవసర పరిస్థితుల కోసం వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు. అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ చిన్నపిల్లల కోసం క్రెచ్ సౌకర్యం కూడా కల్పించారు.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా దేశ రాజధానిలో కూడా గద్దెనెక్కాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నామ్కే వాస్తే పోటీలో ఉంది.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ప్రధానంగా న్యూఢిల్లీ, జంగ్పురా, కల్కాజీ నియోజకవర్గాలపైనే అందరూ దృష్టి సారించారు.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ తరఫున మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ తలపడుతున్నారు.
కల్కాజీ నియోజకవర్గంలో ఆప్ తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా, బీజేపీ నుంచి రమేష్ బిధూడీ పోటీపడుతున్నారు.
జంగ్పురాలో ఆప్ తరఫున మనీష్ సిసోడియా, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి, బీజేపీ అభ్యర్ధిగా తర్వీందర్ సింగ్ మార్వా బరిలో ఉన్నారు.