వక్ఫ్ సవరణ బిల్లు గురించి ఎంఐఎం ఎంపీ ఒవైసీ చేసిన వ్యాఖ్యల మీద జగదాంబికా పాల్ స్పందించారు. వక్ఫ్ బిల్లు వస్తే నిరుపేద ముస్లిములకు, పస్మందాలకు, ముస్లిం విధవలకూ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. జగదాంబికా పాల్, వక్ఫ్ బోర్డు అంశం మీద నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు.
‘‘370వ అధికరణం గురించి చర్చించినప్పుడు రక్తపు నదులు ప్రవహిస్తాయని మెహబూబా ముఫ్తీ అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల మేలు జరిగినట్లే కొత్త వక్ఫ్ బిల్లు వల్ల కూడా మేళ్ళు జరుగుతాయి’’ అని జగదాంబికా పాల్ వ్యాఖ్యానించారు.
జేపీసీ సమావేశాలకు ఒవైసీ కూడా హాజరయ్యారని, ఆ సమావేశాల్లో వక్ఫ్ బిల్లుకు సవరణల మీద చర్చ జరిగిందని, ఆ సవరణలపై ఓటింగ్ జరిపి, వాటిని ఆమోదించారని గుర్తు చేసారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను నమోదు చేసామని కూడా చెప్పారు.
వక్ఫ్ వల్ల కలిగే లాభాలు నిరుపేద ముస్లిములు, పస్మందాలు, ముస్లిం విధవలకు అందాలన్నదే ప్రభుత్వం భావన అని జగదాంబికా పాల్ వివరించారు. ప్రార్థనా స్థలాలు యథాతథంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.
వక్ఫ్ సవరణ బిల్లును ఇప్పుడు ఉన్న రూపంలో ప్రవేశపెడితే అది దేశంలో సామాజిక అస్థిరతకు దారి తీస్తుందని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ నిన్న హెచ్చరించారు. మొత్తం ముస్లిం సమాజం ఆ బిల్లును తిరస్కరిస్తోందని ఒవైసీ అన్నారు.
‘‘వక్ఫ్ బిల్లును ఇప్పుడున్న రూపంలో చట్టం చేయడం అనేది రాజ్యాంగంలోని 25, 26, 14 అధికరణాలకు ఉల్లంఘనే అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ అలా చట్టం చేస్తే అది ఈ దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుంది. యావత్ ముస్లిం సమాజమూ ఆ బిల్లును తిరస్కరించింది. ఏ ఒక్క వక్ఫ్ ఆస్తినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు, దేన్నీ వదులుకోబోము’’ అని లోక్సభలో తన ప్రసంగంలో ఒవైసీ హెచ్చరించారు. ‘‘మీరు దేశాన్ని వికసిత్ భారత్ చేసుకోవాలనుకుంటే సరే. మీరు దేశాన్ని 80లు, 90లలోకి తీసుకుపోతామంటే అది మీ బాధ్యతే’’ అని బెదిరించారు.
‘‘గర్వం కలిగిన భారతీయ ముస్లిముగా నేను నా మసీదులో ఒక్క అంగుళం కూడా వదులుకోను. నా దర్గాలో ఒక్క అంగుళం కూడా వదులుకోను. నేను దానికి ఒప్పుకోను. మేమింక ఎంతమాత్రం దౌత్యపరమైన భాష మాట్లాడబోము. మా ముస్లిములం భారతీయులం. ఈ దేశం మా ఆస్తి. దీన్ని మాకు ఎవరూ ఇవ్వలేదు. దీన్ని మానుంచి మీరు లాక్కోలేరు. వక్ఫ్ అనేది మాకు ఒకరకమైన ప్రార్థన’’ అని ఒవైసీ పార్లమెంటులో కుండ బద్దలుగొట్టి మరీ చెప్పారు.