భారత భూభాగం మీద చైనా బలగాలు ఉన్నాయంటూ పార్లమెంటులో వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద సభాహక్కుల ఉల్లంఘనకు గాను చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసారు. రాహుల్ గాంధీ చైనా వ్యాఖ్యలతో సోమవారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రాహుల్ అబద్ధమాడుతున్నారంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆరోపించారు
ఎంపీ నిశికాంత్ దూబే ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసారు. ఆ లేఖలో ‘‘రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చారిత్రక వాస్తవాలను సైతం సిగ్గు లేకుండా వక్రీకరిస్తున్నారు. మన దేశాన్ని ఎగతాళి చేయడానికి, భారత గణతంత్రపు ప్రతిష్ఠను దిగజార్చడానికీ ప్రయత్నించారు’’ అని ఆరోపించారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి జవాబిచ్చే క్రమంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో దాడికి ప్రయత్నాలు చేసారు. ‘మేకిన్ ఇండియా’ ద్వారా ఉత్పాదక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఆ క్రమంలోనే మాట్లాడుతూ ఈ ప్రభుత్వమే భారత భూభాగం మీద చైనీస్ బలగాల ఉనికికి నిదర్శనమన్నారు.
రాహుల్ ప్రసంగానికి మంత్రి కిరెన్ రిజిజు అడ్డుపడ్డారు. తప్పుడు కథనాలను వ్యాపింపజేస్తున్నారంటూ రాహుల్ గాంధీ మీద ఆరోపణలు చేసారు. ‘‘అటువంటి చర్యలు, అలాంటి భాష పదేపదే ఉపయోగించకూడదని గుర్తు చేస్తున్నాం. అలాంటి మాటలు పార్లమెంటరీ ప్రమాణాలకు ఎంతమాత్రం తగినవి కావని చెప్పారు.
చైనా పేరిట చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించడంలో రాహుల్ గాంధీ విఫలమైతే అతనికి వ్యతిరేకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు భావిస్తున్నారు.
రాహుల్ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలో ‘మన దేశానికి చెందిన 4వేల చదరపు కిలోమీటర్ల భూభాగం మీద బీజింగ్ కూర్చుని ఉంది’ అని చెప్పారు. ‘‘మేకిన్ ఇండియా విఫలమైనందునే చైనా మన భూభాగంలోకి రాగలిగింది. భారతదేశం ఈ విప్లవాన్ని చైనాకు చేజేతులారా అప్పగించేస్తుంద’’ని రాహుల్ ఆందోళన వ్యక్తం చేసారు. రాహుల్ వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తీవ్రంగా ఖండించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను గురించి అలా నిరాధారమైన ప్రకటనలు తాను చేయలేనని చెప్పారు.
రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పైనా విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి తనను ఆహ్వానించాలని కోరడానికే ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌ను అమెరికాకు పలుమార్లు పంపించారని ఆరోపించారు.
రాజ్యసభ సభ్యుడైన జయశంకర్, రాహుల్ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అమెరికా ప్రతినిధులతో తన చర్చల్లో ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం గురించిన చర్చ జరగనే లేదని స్పష్టం చేసారు. ‘‘మన ప్రధాని అలాంటి కార్యక్రమాలకు హాజరవరు అన్న సంగతి అందరికీ తెలుసు. నిజాని3కి భారత్ అలాంటి సందర్భాల్లో తమ ప్రత్యేక దౌత్యాధికారులను పంపిస్తుంది’’ అని వివరించారు.