అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు పరుగులు తీశాయి. ఒకే రోజు మదుపరుల సంపద రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ఒక దశలో 1400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 1200 పాయింట్లుపైగా లాభపడింది. కెనడా, మెక్సికోలపై పెంచిన సుంకాలను నెలరోజులపాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది.
ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. సెన్సెక్స్ 1226 పాయింట్ల లాభంతో 78413 పాయింట్ల రికార్డు స్థాయిలో ముగిసింది. నిఫ్టీ 378 పాయింట్లు పెరిగి 23739 వద్ద స్థిరపడింది.ఐరాపా, ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ లాభపడ్డాయి.నెస్లే ఇండియా, మారుతీ, యూనిలీవర్, జొమాటో, ఐటీసీ హోటల్స్ నష్టాలను చవిచూశాయి.
ముడిచమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు 78 అమెరికా డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు స్వచ్ఛమైన 31 గ్రాముల పసిడి ధర 2847 డాలర్లకు పెరిగింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 87.07కు పడిపోయింది.