ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉన్న వేళ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తమపై పదేపదే ఒత్తిడి తెచ్చే యుక్తులు పన్నుతున్నారని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పెట్టిన ఒక పోస్ట్‌లో ఎన్నికల కమిషన్, తమ మీద జరుగుతున్న అటువంటి ప్రయత్నాలను గుర్తించామని వివరించింది. అయితే వాటికి స్పందించకుండా సంయమనం పాటిస్తున్నామని చెప్పింది. అటువంటి అరుపులూ పెడబొబ్బలను విచక్షణ, స్థితప్రజ్ఞతలతో ఎదుర్కోవడానికే సిద్ధపడ్డామని వివరించింది. రాజకీయ పార్టీల వ్యంగ్య దూషణలకు లొంగిపోపబోమని ఈసీ స్పష్టం చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరిపించామని, వాటిపై తగు చర్యలు తీసుకున్నామనీ ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. లక్షన్నరకు పైగా అధికారులు చట్టపరమైన పరిధిలో విస్తృతమైన ప్రక్రియ ద్వారా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపేందుకు కృషి చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఇతర ఆప్ నాయకులు ఎన్నికలకు సంబంధించి చేసిన వ్యాఖ్యల మీద ఎలక్షన్ కమిషన్ స్పందించింది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ కుటుంబం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందనీ, అయినా ఈసీ చూసీ చూడనట్లు ఊరుకుందనీ ఆప్ నాయకులు ఆరోపణలు చేసారు.
అరవింద్ కేజ్రీవాల్ అయితే ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేస్తుందని, హోంశాఖ చెప్పినట్టు చేయడమే పనిగా పెట్టుకుందనీ ఆరోపించారు. ప్రచారం ఆఖరి రోజు అయిన సోమవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు రిటైర్ అయిపోయాక మంచి పదవి ఇస్తానని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆశపెట్టిందని ఆరోపించారు. ఈ నెల రిటైర్ అయిపోతున్న రాజీవ్ కుమార్‌ను ప్రశ్నిస్తూ మీకు రాష్ట్రపతి పదవి లేక గవర్నర్ పదవి ఆశ చూపారా అని అడిగారు.