మహాకుంభమేళాలో వృద్ధులకు యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద వృద్ధులు పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లు బస చేయడానికి ప్రత్యేక టెంట్లు కేటాయించారు. గతవారం మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరవాత యోగీ సర్కార్ భద్రత మరింత పెంచింది.
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు పరికరాలు సరఫరా చేసేందుకు యూపీ సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, చెవిటి వారికి మెషీన్లు సరఫరా చేస్తున్నారు. మహాకుంభ మేళాలో కనీసం 2 వేల మందికి వినికిడి యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.
మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 38 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసేనాటికి 48 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. ప్రత్యేక పర్యదినాల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఇప్పటికే 6 లక్షల మంది విదేశీయులు కూడా పుణ్యస్నానాలు చేశారు. 136 దేశాలకు చెందిన భక్తులు వచ్చారని అంచనా. రాబోయే కొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేస్తారని తెలుస్తోంది.