సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన తల్లిదండ్రులు
చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో ఇంజనీరుగా పనిచేసిన ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణం వెనుక అనుమానాలున్నాయని ఆయన తల్లి పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు. సుచిర్ బాలాజీ మరణం వెనుక కుట్ర లేదని, అతను నివాసం ఉన్న అపార్టమెంటు సీసీ ఫుటేజీ పరిశీలించామని అమెరికా పోలీసులు చెప్పిన దానిలో నిజం లేదని పూర్ణిమారావు ఆరోపించారు. అసలు సీసీటీవీ ఫుటేజీ కోసం ఎవరూ తమను కలవలేదని అపార్టుమెంటు నిర్వహణ సిబ్బంది చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. సుచిర్ బాలాజీ మరణం వెనుక కుట్ర ఉందని తాము అనుమానిస్తున్నామని ప్రత్యేకంగా విచారణ జరిపించాలని పూర్ణామారావు పిటిషన్ వేశారు.
సుచిర్ బాలాజీ కేసు విచారణలోనూ అనేక లోపాలు వెలుగుచూశాయి. బాలాజీ పోస్టు మార్టు రిపోర్టును అనుమానించిన ఆయన తల్లి పూర్ణిమారావు, ప్రైవేటు ఏజన్సీతో మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు ప్రకటించిన పోస్టుమార్టం రిపోర్టు, ప్రైవేటు ఏజన్సీ రిపోర్టుతో సరిపోలడం లేదని పూర్ణిమారావు ఆరోపిస్తున్నారు.
సుచిర్ బాలాజీ #suchirbalaji మృతి వెనుక కుట్ర ఉందని తాము కూడా అనుమానిస్తున్నామని ఓ సోషల్ మీడియా దిగ్గజం వ్యాఖ్యానించారు. బాలాజీ మరణానికి కారణాలు వెలికితీయాలని డిమాండ్ పెరుగుతోంది. ఓపెన్ ఏఐ యాజమాన్యం బాలాజీని పొట్టనబెట్టుకుందని పూర్ణిమారావు ఆవేదన చెందుతున్నారు. ఈ కేసులో మిస్టరీని వెలికితీయాలని డిమాండ్ చేస్తోంది.