బంగారం ధర జీవితకాల గరిష్ఠాలను తాకింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి రూ.86000 దాటిపోయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరవాత తీసుకుంటున్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా కెనడా, చైనా, మెక్సికోలపై సుంకాలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో స్టాక్ సూచీలు దారుణంగా పతనం అయ్యాయి.
ట్రంప్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. తాజాగా 31 గ్రాముల ఔన్సు స్వచ్ఛమైన బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 2829 డాలర్లు దాటిపోయింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 87.11కు తగ్గడంతో బంగారం ధర దేశంలో మరింత పెరిగింది.
వెండి ధర కూడా దూసుకుపోతోంది. తాజాగా కిలో వెండి రూ.96000 దాటిపోయింది. స్టాక్ సూచీలు పతనం, బంగారంలో పెట్టుబడులు పెరగడంతో మెటల్ ధరలు ఎగబాకుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. తాజాగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్లు దాటిపోయింది.