లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
తిరుమల, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయం వద్ద స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని భద్రాచలం, యాదగిరిగుట్టలోనూ ఆదిత్యుడికి ప్రత్యేక పూజలు జరిగాయి.
తిరుమలలో సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. తిరు వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల కోసం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. అన్నపానీయాల సరఫరాకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లోకి చేరుకోలేని భక్తులకోసం తిరుమాడ వీధులకు వెలుపల ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఉదయం అనంతరం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై విహరించారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనంపై తిరు వీధుల్లో కోనేటిరాయుడు విహరించనున్నారు.
అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నేడుస్వామివారు నిజరూపంలో దర్శనమివ్వనున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు . దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.