అమెరికాలోని సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్‌కు భారత్ రావడానికి వీలు లేకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీసా నిరాకరించింది. క్షమా సావంత్ భారతదేశంలో సీఏఏ, ఎన్ఆర్‌సిలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది. అలాంటి క్షమా సావంత్ ఇప్పుడు, బీజేపీ విధానాలను విమర్శించినందునే తనను భారత్‌లోకి రానీయడం లేదంటూ ఏడుపులు మొదలుపెట్టింది.
‘‘అనారోగ్యంతో ఉన్న నా తల్లిని చూడడానికి భారత్ రావడానికి వీలు లేకుండా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం నాకు వీసా నిరాకరిస్తున్నాయి’’ అంటూ క్షమా సావంత్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
‘‘భారతదేశంలో కార్మికులు, కర్షకులు, ముస్లిములు, ఇతర బలహీన వర్గాల మీద మోదీ, బీజేపీ దాడులు చేస్తూ ఉన్నాయి. ముస్లింలకు, పేదలకూ వ్యతిరేకమైన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని వ్యతిరేకించడం కూడా తప్పయిపోయింది’’ అని ఆరోపించింది.
పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ 2019లో పాస్ అయింది. దాని ప్రకారం భారత్ నుంచి విడిపోయిన అప్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో వివక్ష ఎదుర్కొంటూ అక్కణ్ణుంచి పారిపోయి శరణార్థులుగా భారత్ వచ్చిన, వస్తున్న హిందువులు, సిఖ్ఖులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారు. అంతే తప్ప క్షమా సావంత్ వంటి మూర్ఖులు దుష్ప్రచారం చేసినట్లుగా ఆ చట్టం ముస్లిములను లక్ష్యం చేసుకోలేదు, ఏ భారతీయ పౌరుడి హక్కులనూ అణగదొక్కలేదు.
సీఏఏ, ఎన్ఆర్‌సీ చట్టాల వల్ల లక్షలాది మంది భారతీయ ముస్లిముల పౌరసత్వాన్ని లాగేసుకుంటారు అనే దుష్ప్రచారం విపరీతంగా జరిగింది. అలాంటి దుష్ప్రచారం చేసిన వేలాదిమందిలో క్షమా సావంత్ కూడా ఒకరు. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి భారతీయ ముస్లిముల్లో భయాందోళనలు కలిగించడం, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపట్ల విద్వేషాన్ని నూరిపోయడమే వారి లక్ష్యం. సీఏఏ లక్ష్యం భారత్ నుంచి విడిపోయిన దేశాల్లో మతపరంగా విద్వేషాన్ని, ఊచకోతనూ ఎదుర్కొంటున్న మైనారిటీలకు ఆశ్రయం ఇవ్వడమే తప్ప ఎవరి హక్కులనూ లాగేసుకోవడం కాదని భారత ప్రభుత్వం ఎన్నోసార్లు వివరణ ఇచ్చింది.
క్షమా సావంత్ వివాదాస్పదంగా ప్రవర్తించడం ఇదేమీ మొదటిసారి కాదు. సియాటెల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నప్పుడే ఆమె భారతదేశాన్ని లక్ష్యం చేసుకుని ఎన్నో భారత వ్యతిరేక తీర్మానాలు చేయించింది. 2023లో ఆమె, హిందూ వ్యవస్థలో కుల ఆధారిత వివక్ష ఉందంటూ ఆరోపణలు చేసి సియాటెల్ నగరంలో హిందువులకు మాత్రం అదనపు లీగల్ స్క్రూటినీ విధించేలా చేసింది. ఆ చర్యపై హిందూ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. క్షమా సావంత్ రాజకీయ ఉద్దేశాల గురించి ప్రశ్నలు తలెత్తాయి. సియాటెల్‌లోని హిందూ కమ్యూనిటీని క్షమా సావంత్ దురుద్దేశపూర్వకంగా చెడుగా చిత్రీకరించిందని అక్కడి హిందూ సంఘాలు మండిపడ్డాయి.
సియాటెల్ సిటీ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్నప్పుడు క్షమా సావంత్ సీఏఏ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలను ముందుండి నడిపించింది. ఆ ఆందోళనలు చాలాసార్లు హింసాత్మకంగా మారడంలో ఆమెదే ప్రధాన పాత్ర. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చి ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ఆందోళనల సందర్భాల్లో క్షమా సావంత్ అసాంఘిక శక్తులకు అండగా నిలవడం, వారి పక్షాన ఎలుగెత్తి మాట్లాడడం అమెరికాలోనూ, భారత్‌లోనూ ఆందోళన కలిగించాయి. భారతదేశపు అంతర్గత వ్యవహారాల గురించి విదేశంలో తప్పుడు ప్రచారం చేయడానికి ఆమె తన అంతర్జాతీయ ప్రభావశీలతను ప్రయోగించడం పట్ల భారత్‌లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు క్షమా సావంత్‌కు వీసా నిరాకరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘భారత వ్యతిరేకుల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. భారతదేశం గురించి సత్యాలను వక్రీకరించి ప్రచారం చేయడం, దేశ సమైక్యతకు భంగం కలిగించేలా దుష్ప్రచారాలను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించడం వంటి ప్రయత్నాలను భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ