కేంద్ర రైల్వే మంత్రి తెలుగు రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు. త్వరలో ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు ప్రయాణించనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఏపీలో రూ. 88 వేల కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం రైల్వే పనులకు బాగా సహకరిస్తోందని కితాబిచ్చారు.
వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా 50 నమో భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల విద్యుద్దీకరణ వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. కొన్ని మార్గాల్లో గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్లు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరికొన్ని మార్గాల్లో గంటకు 130 కి.మీ, కొన్ని మార్గాల్లో గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణించేలా మార్గాలను తీర్చి దిద్దుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి అన్ని మార్గాల్లో కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సికింద్రాబాద్ స్టేషన్లో మాస్టర్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
దేశ వ్యాప్తంగా 200 కొత్త వందేభారత్ రైళ్లు రాబోతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 5 వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయన్నారు. వందేభారత్ రైళ్లు నూరు శాతం అక్యుపెన్సీతో నడుస్తున్నాయని గుర్తుచేశారు. పేదలకు అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. వీటిల్లో 1000 కి.మీ ప్రయాణానికి కేవలం రూ.450 మాత్రమే టికెట్ ధర ఉంటుందని వెల్లడించారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ