తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాను సీఎం చంద్రబాబునాయుడు కోరారు. గత ఐదేళ్లలో ఏపీని 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, వైసీపీ ప్రభుత్వం లక్షన్నర కోట్ల బిల్లులు చెల్లించలేదని చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. ప్రతి నెలా అప్పులు వడ్డీలు చెల్లించేందుకుకే రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.
అప్పుల ఊబి నుంచి బయటపడేలా ఏపీకి సాయం చేయాలని చంద్రబాబునాయుడు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ను కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అతి తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని అభ్యర్థించారు. రాజధానిలేని రాష్ట్రంగా ఏపీ తయారైందని, మరోవైపు అప్పులు వడ్డీలు చెల్లించేందుకే ఆదాయం చాలడం లేదని చంద్రబాబునాయుడు రెండున్నర గంటలకుపైగా పవర్ పాయింట ప్రజంటేషన్ ద్వారా పనగడియాకు వివరించారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై అరవింద్ పనగడియా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పోలవరం, అమరావతి రాజధాని పనులకు నిధుల కొరత రాదన్నారు. ఏపీలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై అరవింద్ పనగడియా ఆందోళన వ్యక్తం చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ