అంతర్జాతీయ వాణిజ్యానికి గేట్ వేగా ఉన్న పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలు అమల్లోకి తీసుకువచ్చేలా ఉన్నారు. ఫీజులు తగ్గించకపోతే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. పనామా కాలువపై చైనా నియంత్రణ తగ్గించాలంటూ పనామా అధ్యక్షుడికి హెచ్చరికలు పంపారు.
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో, పనామా అధ్యక్షుడు ములినోతో సమావేశం అయ్యారు. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని నివారించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా హెచ్చరికలకు భయపడేది లేదని పనామా అధ్యక్షుడు ములినో భేటీ అనంతరం స్పష్టం చేశారు. దీంతో పనామా కాలువ స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర చర్యలు తప్పవని, అయితే సైనిక చర్యలు
ఉండకపోవచ్చని తెలిపారు.
చైనాతో 2017లో చేసుకున్న రోడ్ అండ్ బెల్డ్ ప్రాజెక్టు నుంచి పనామా బయటకు వచ్చింది. ఇక ఆ ఒప్పందాన్ని పునరుద్దరించుకునే ప్రసక్తే లేదని ములినో ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల తరవాత పనామా నిర్ణయంపై చర్చ మొదలైంది. పనామా కాలువ విషయంలో చైనా నియంత్రణను అడ్డుకోవాలి. లేదంటే అమెరికా గట్టి చర్యలు తీసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు.
పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. పనామా, అమెరికాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999లో కాలువను అప్పగించింది. అమెరికా వాణిజ్య, సైనిక నౌకల నుంచి పనామా పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తోంది. తగ్గించాలని అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. లేదంటే కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది.