దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. బీజేపీపై ఆప్ నేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను కూడా తొలగించదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమన్నారు.
ఆదివారం దిల్లీ ఆర్కేపురం ప్రాంతంలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, తమ పార్టీ మాటకు కట్టుబడేదని అన్నారు. బడ్జెట్‌లో రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడమే అందుకు రుజువు అన్నారు.
దిల్లీ ప్రజలకు అందుతున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా తాము ఆపబోము అన్నారు. బిహార్, పూర్వాంచల్ నుంచి దిల్లీకి వచ్చి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉంటామన్నారు.కాంగ్రెస్, ఆప్ లు రెండూ అవినీతి పార్టీలే అన్నారు.