ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం
రెండోసారి టైటిల్ గెలిచిన భారత యువతుల జట్టు
మహిళల అండర్ 19టీ20 ప్రపంచ కప్-2025 టోర్నీలో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. వరుసగా రెండో సారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ ఖాతాలో వేసుకుంది.
టైటిల్ పోరులో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్ కాగా జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో నిరాశపరిచారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో గొంగడి త్రిష మూడు వికెట్లు తీయగా పరుణిక సిసోడియా, ఆయుషి శుక్లా , వైష్ణవి శర్మ తలా రెండు వికెట్లు తీశారు. షబ్నమ్ షకీల్ కు ఒక వికెట్ దక్కింది.
లక్ష్యఛేదనలో భారత్ 11.2 ఒవర్లో ఒక వికెట్ నష్టపోయి 84 పరుగులు చేసింది. కమలిని(8) నిరాశ పరిచినప్పటికీ గొంగడి త్రిష, సానికా చాల్కే లు క్రీజులో నిలబడి భారత్ కు విజయాన్ని అందించారు. మ్యాచ్ ముగిసే సమయానికి త్రిష(44*), సానికా( 26*) క్రీజులో ఉన్నారు.