శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న రథసప్తమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఉదయం యోగా కార్యక్రమాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వేడుకలను ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
ఈ ఏడాది రథసప్తమి సందర్బంగా పర్యాటకులకోసం హెలికాఫ్టర్ రైడ్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ రుసుముతో 8 నిమిషాల హెలికాప్టర్ రైడ్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలికాఫ్టర్ సేవలు ఉపయోగించుకోవచ్చు.
ఉడాన్ పథకం ద్వారా 125 ప్రాంతాలను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాయితీలు ప్రకటించిందని పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు. దీని ద్వారా మధ్యతరగతికి విమానయానం అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో దాదాపు 12 కొత్త ప్రాంతాలకు విమానసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.