పతంజలి ఆయుర్వేద ఫార్మసీ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పతంజలి సంస్థకు చెందిన దివ్య ఫార్మా తయారు చేసిన ఆయుర్వేద మందులపై తప్పుడు ప్రచారం చేసినందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా, సీఈవో బాలకృష్ణపై కేరళలోని పాలక్కాడ్‌లో కేసు నమోదైంది. ఫిబ్రవరి 1న విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
ఫిబ్రవరి 15న మరోసారి కేసు విచారణకు రానుంది. ఇప్పటికే దివ్య ఫార్మాకు చెందిన 10 ఆయుర్వేద ఉత్పత్తులపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. కోవిడ్ సమయంలో తప్పుడు ప్రకటనలు ఇచ్చిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం భారీగా జరిమానా కూడా విధించింది. తాజాగా కేరళలో నమోదైన కేసు విచారణ జరుగుతోంది.
పతంజలి ఫార్మా తయారు చేసిన ఆయుర్వేద మందులతో కరోనా తగ్గుతుందంటూ దేశ వ్యాప్తంగా ఆ సంస్థ ప్రకటనలు ఇచ్చింది. ఎలాంటి నిర్ధారణ లేకుండా ఇలాంటి ప్రకటనలు ఎలా ఇస్తారంటూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు దివ్యా ఫార్మాకు భారీగా జరిమానా విధించడంతోపాటు, 10 ఉత్పత్తులను నిషేధించింది.