ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది.
ఆర్పీ ఠాకూర్ నియామకంపై సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ విధులు నిర్వహిస్తారని, రెండేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఆర్పీ ఠాకూర్ 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, శాంతిభద్రతల ఏడీజీగా, అనంతపురం, చిత్తూరు రేంజ్ డీఐజీగా, 2016 నవంబర్ 19 నుంచి ఏపీ అవినీతి నిరోధక శాఖలో డీజీగా పనిచేశారు. ఏపీ డీజీపీగా 2018 జులై 1 నుంచి 2019 జూన్ 1 వరకు కొనసాగారు. తర్వాతకాలంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన సస్సెండ్ అయ్యారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయనపై నమోదైన కేసులు ఎత్తివేయడంతో పాటు సస్పెన్షన్ కాలానికి సంబంధించిన వేతనాలు, అలవెన్స్‌లు మొత్తం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.