హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇవాళ ఇద్దరు బందీలను విడుదల చేశారు. ఫ్రెంచ్ ఇజ్రాయెలీ ఓఫర్ కల్డెరోన్, యార్డెన్ బిబిస్‌లను హమాస్ ఉగ్రవాదులు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. మరో అమెరికన్ ఇజ్రాయెలీని కూడా ఇవాళ విడుదల చేసే అవకాశముంది.
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై చేసిన దాడిలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. 94 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో ఇప్పటి వరకు 14 మందిని విడుదల చేశారు. మరో 8 మంది బందీలు చనిపోయారని తమ వద్ద సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా దశలవారీగా బందీల విడుదల కొనసాగుతోంది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే 110 మందిని విడుదల చేసింది. మొత్తం 1700 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు.
హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరవాత జరిగిన పోరులో ఇప్పటి వరకు 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 15 లక్షల మంది నిరాశ్రయలయ్యారు. ఈజిప్ట్, ఖతర్ చొరవతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య 42 రోజుల కాల్పుల విరమణ కొనసాగుతోంది.