ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ ఘనంగా చేయడం పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణ 24 పరగణాల జిల్లా మహేస్థలలోని బాటానగర్‌లో 111 అడుగుల సరస్వతీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
చదువుల తల్లి మహామూర్తిని తయారుచేయడానికి వెదురు, జౌళి, థర్మోకోల్, కాగితం వాడారు. 200 మంది కళాకారులు 3 నెలల పాటు నిరంతరాయంగా శ్రమించడంతో ఆ విగ్రహం రూపుదిద్దుకుంది. బాటానగర్ క్రియేషన్, బాటానగర్ స్క్వాడ్ సంస్థలు సంయుక్తంగా అక్కడ మహావైభవంగా పూజా కార్యక్రమం ఏర్పాటు చేసారు. స్థానిక కౌన్సిలర్, పూజా కమిటీ కన్వీనర్ గోపాల్ సాహా ఆ ఏర్పాట్లకు నేతృత్వం వహించారు.
సరస్వతీదేవి భారీ మూర్తి ఎంతో సంక్లిష్టమైనదనీ, ఆ మూర్తి నిర్మాణంలో పలు సవాళ్ళు ఎదురయ్యాయనీ గోపాల్ సాహా చెప్పారు. ఇప్పటివరకూ దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎక్కడా ఏ సరస్వతీ పూజా పండాల్‌లో అంత పెద్ద విగ్రహం తయారు చేయలేదని గోపాల్ అన్నారు. 111 అడుగుల మహాసరస్వతి విగ్రహం ప్రపంచ రికార్డు అని అభిప్రాయపడ్డారు. విగ్రహం రూపకల్పన, తయారీ, అమర్చడం, పూజల నిర్వహణ ఇలా ప్రతీ దశలోనూ భద్రత, రక్షణకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు.
సరస్వతీదేవి భారీ విగ్రహాన్ని చూడడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ వసంత పంచమి సందర్భంగా కనీసం 1.5లక్షల మంది భక్తులు ఈ చదువుల తల్లిని సందర్శించుకుంటారని అంచనా.
భారతీయ సంప్రదాయిక కాలమానం ప్రకారం మాఘమాసం శుక్ల పంచమి తిథిని వసంత పంచమి లేదా శ్రీ పంచమి లేదా సరస్వతీ పంచమిగా జరుపుకుంటారు. వసంత ఋతువు ఆగమనానికి ఈ పర్వదినం సూచికగా నిలుస్తుంది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ