గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఇటీవల కూల్చివేసిన దర్గా వద్ద ఉరుసు నిర్వహించుకోడానికి అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉరుసు ఉత్సవం ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. దాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల కూల్చేసిన హాజీ మంగ్రోలీ షా దర్గా దగ్గరే జరుపుకోవాలని ముస్లిముల పక్షం భావించింది.
దర్గాను గుజరాత్ ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా కూల్చేసిందంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు దాఖలైంది. దాని విచారణలో భాగంగా ఇంటర్‌లాక్యుటరీ అప్లికేషన్ ద్వారా ఉరుసు జరుపుకోడానికి అనుమతి కోరారు. జస్టిస్ బి.ఆర్ గవాయ్, ఎ.జి మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వారి దరఖాస్తును డిస్మిస్ చేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రధానాంశం నుంచి విడిగా ఈ విజ్ఞప్తిని పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
దర్గా ట్రస్టీల తరఫున సీనియర్ అడ్వొకేట్ హెచ్ సయ్యద్, ఆ దర్గా ఒక రక్షిత స్థలమనీ, అక్కడ ఉర్సు ఉత్సవం కొన్ని యేళ్ళ తరబడి సాగుతోందనీ వాదించారు. ఏటా జరిగే మతకార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని, సంప్రదాయాలను ఉల్లంఘించడమేననీ వాదించారు.
ప్రస్తుతం ఆ స్థలంలో దర్గా లేదు కాబట్టి, అక్కడ ఉరుసు జరుపుకోడానికి అనుమతి ఇవ్వనక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు నిరాకరించాయి. కానీ అక్కడ చట్టపరమైన పద్ధతులు ఏవీ పాటించకుండా దర్గాను కూల్చేసారు, దాని మతపరమైన గుర్తింపును ఉపేక్షించారు అని సయ్యద్ వాదించారు.
గుజరాత్ ప్రభుత్వపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ దరఖాస్తును ఖండించారు. కూల్చివేతకు కారణం మతపరమైన వివక్ష కాదని స్పష్టం చేసారు. ప్రభుత్వ భూముల్లో ఉన్నఅక్రమ కట్టడాలను తొలగించే క్రమంలో దర్గాను తీసివేసారని చెప్పారు. ఆ మార్గంలోని దేవాలయాలు, ఇతర మతాల ప్రార్థనా స్థలాలకూ అదే గతి పట్టిందనీ గుర్తు చేసారు. పురావస్తు శాఖ సమర్పించిన అఫిడవిట్ గురించి కూడా తుషార్ మెహతా ప్రస్తావించారు. ఆ ప్రదేశంలో అధికారికంగా ఎలాంటి రక్షిత కట్టడమూ లేదని తేల్చిచెప్పారు. 2023లో చేపట్టిన సర్వే ప్రకారం అక్కడ ఎలాంటి పురావస్తు నిర్మాణాలూ లేవని స్పష్టం చేసారు. దాంతో, అక్కడ ఉరుసు జరుపుకోడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.