ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20లో విజయం సాధించిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. పుణే వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై గెలిచింది. దీంతో 3-1తేడాతో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరగనుంది.
నాలుగో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. శివమ్ దూబే (53), హార్దిక్ పాండ్యా (53), రింకూ సింగ్ (30), అభిషేక్ శర్మ(29) రాణించారు. సంజూ శాంసన్(1), తిలక్ వర్మ(0), సూర్యకుమార్ యాదవ్(0)అక్షర పటేల్ ( 5), అర్షదీప్ సింగ్ ( 0) విఫలమయ్యారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు తీయగా జేమీ ఓవర్టన్ రెండు అదిల్ రషీద్, బ్రైడన్ కార్సె చెరొక వికెట్ తీశారు.
అనంతరం భారత్ విధించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టు 19.4 ఓవర్లకే ఆలౌట్ అయింది. 166 పరుగుల వద్ద ఆటను ముగించింది. దీంతో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఇంగ్లాండ్ టీమ్ లో హ్యారీ బ్రూక్ (51) టాప్ స్కోరర్ గా నిలవగా ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిల్ సాల్ట్ (23) రాణించారు. కెప్టెన్ జోస్ బట్లర్ (2), లియామ్ లివింగ్ స్టన్ (9), జాకబ్ బెతెల్ (6) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. జేమీ ఓవర్టన్ (19), అదిల్ రషీద్ (10) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా యువ పేసర్ హర్షిత్ రాణా మూడు , వరుణ్ చక్రవర్తి రెండు , అర్షదీప్ సింగ్ , అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు.