కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.5 శాతంగా అంచనా వేశారు. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. అనంతరం సభను ఉప రాష్ట్రపతి శనివారానికి వాయిదా వేశారు.
ముగిసిన ఆర్థిక సంవత్సరం ఫలితాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలను ఆర్థిక సర్వే ప్రతిఫలిస్తుంది. కేంద్రంలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఈ ఆర్థిక సర్వే నివేదికను తయారు చేస్తుంది. 1950లో బడ్జెట్‌తోపాటే ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. 1960నుంచి బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఈ సర్వే నివేదిక ద్వారా తెలుస్తుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మందగిస్తుందని అంచనా. ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు అంచనాలను అందుకోలేదు. 2022లో 8.2 శాతం వృద్ధి రేటు నమోదు కాగా ఆ తరవాత తగ్గుతూ వచ్చింది. కార్పొరేట్ రంగం మందగించడం, తయారీ రంగంలో ఆశించిన వృద్ధి లేని కారణంగా జీడీపీ తగ్గుదలకు కారణంగా భావిస్తున్నారు.