భారత్ శరవేగంగా వృద్ధి సాధించేందుకు ఫాస్ట్ ట్రాక్ రిఫామ్స్ తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. శరవేగంగా సంస్కరణలు అమలు చేయడంతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్దంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తుచేశారు.
గడచిన పదేళ్లలో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. రాబోయే నాలుగేళ్లలో 3 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
భారత్ ఏఐని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. డిజిటల్ విప్లవం సాధించిన భారత్, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించడానికి సిద్దంగా ఉందని చెప్పారు. గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా త్వరలో మానవ సహిత అంతరిక్ష యాత్ర సుసాధ్యమవుతుందన్నారు.
నూతన ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ అవతరిస్తోందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సాహాసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుల అమలు దిశగా ముందడుగు పడుతోందన్నారు. మహిళలు అనేక రంగాల్లో దూసుకెళుతున్నారని ద్రౌపది ముర్ము చెప్పారు. నేషనల్ లౌవ్లీవుడ్ మిషన్ ద్వారా 91 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేసినట్లు ద్రౌపది ముర్ము చెప్పారు. 3 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.