శక్తిమేరకు పనిచేస్తానన్న కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేశారు. ఆయనకు తోటి పోలీసు అధికారులు, సిబ్బంది వీడ్కోలు పరేడ్ ను ఘనంగా నిర్వహించారు.
మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో జరిగిన పరేడ్ లో రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ పాల్గొని తిరుమలరావుకు వీడ్కోలు పలికారు. ద్వారకా తిరుమలరావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడిన ద్వారకా తిరుమలరావు, భావోద్వేగానికి గురయ్యారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామన్నారు. ప్రభుత్వ సహకారంతోనే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ సమర్థంగా చర్యలు చేపటగల్గామన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నూతన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తిమేర పని చేస్తానన్నారు.