అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. యూపీలోని సీతాపుర్ ఎంపీ రాకేశ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే మధ్యలోనే పోలీసులు ప్రవేశించి అరెస్టు చేసి తీసుకెళ్లడం సంచలనంగా మారింది.
పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేసి ఎంపీ రాకేశ్ రాథోడ్ పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ జనవరి 17న సీతాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు తరవాత ముందస్తు బెయిల్ కావాలంటూ ఎంపీ రాకేశ్ రాథోడ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు వారాల్లో కింది కోర్టులో లొంగిపోవాలంటూ న్యాయమూర్తి ఆదేశించారు. కింద కోర్టులో కూడా ముందస్తు బెయిల్ లభించలేదు. తాజాగా సీతాపుర్లో ఎంపీ రాకేశ్ రాథోడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుండగానే పోలీసులు అరెస్ట్ చేశారు.
రాకేశ్ రాథోడ్ అరెస్టుకు ముందే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రాథోడ్ అరెస్టుతో సీతాపుర్లో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.ఎంపీని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.