ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చొరవతో విజయవాడ నగరంలోని పాకిస్తాన్ కాలనీ పేరు మారింది. కొత్తగా ఆ ప్రాంతానికి ఇప్పుడు ‘భగీరథ కాలనీ’ అని పేరు పెట్టారు.
1971లో పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో తూర్పు పాకిస్తాన్‌కు చెందిన కొందరు, శరణార్థులుగా భారతదేశంలోకి వచ్చారు. వారిలో సుమారు 40 కుటుంబాలకు విజయవాడలో తాత్కాలికంగా ఇళ్ళు నిర్మించి ఇచ్చారు. అప్పటినుంచీ దాన్ని పాకిస్తాన్ కాలనీగా వ్యవహరించడం మొదలైంది. కొన్నేళ్ళ తర్వాత బుడమేరుకు వరదలు వచ్చినప్పుడు కొందరు వరద బాధితులకు ఆ కాలనీలో ఆశ్రయం కల్పించారు. ఇప్పుడా కాలనీలో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి.
పాకిస్తాన్ కాలనీ పాయకాపురం ప్రాంతంలో కార్పొరేషన్ 62వ డివిజన్లో ఉంది. ఆ పేరుతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శత్రుదేశం పేరిట కాలనీ ఉండడం సహించలేని విషయం. దానికి తోడు, అక్కడి వారికి పాస్‌పోర్టులు రావడం లేదు. అలా, ఆ కాలనీ వాసులకు ఆ పేరే ఒక సమస్యగా మారింది.
కొన్నాళ్ళ క్రితం ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు కాలనీ వాసులు తమ కష్టాల గురించి వివరించారు. దాంతో కలెక్టర్ చొరవ తీసుకుని కాలనీ పేరు మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కాలనీ పేరు మార్చడానికి తొలుత మునిసిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయాలి. దాంతో, మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 418 ప్రకారం పేరు మార్పు కోసం జిల్లా యంత్రాంగం సిఫారసు చేసింది. విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర, కాలనీ పేరు మార్చడానికి కౌన్సిల్ అనుమతి తీసుకున్నారు.
ఆ ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు ఆ కాలనీ పేరు మార్చేసారు. మొన్న మంగళవారం నుంచీ అది పాకిస్తాన్ కాలనీ కాదు, భగీరథ కాలనీగా మారిపోయింది. ఆ మేరకు 60మంది కాలనీ వాసుల ఆధార్ కార్డులలో చిరునామాలు సైతం మార్చేసారు.