ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందించే వాట్సప్ గవర్నెన్స్‌ను మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రారంభించారు. వాట్సప్ ద్వారా ప్రస్తుతానికి 161 పౌరసేవలు అందించనున్నారు. రాబోయే రెండు నెలల్లో ఈ సేవలను 500లకు పెంచాలని యోచిస్తున్నారు. వాట్సప్ నెంబరు 9552300009ను కేటాయించారు. ఈ నెంబరు ఫోనులో సేవ్ చేసుకుని, మీకు కావాల్సిన సేవలను ఎంచుకోవచ్చు.
జనన, మరణ సర్టిఫికెట్లతోపాటు, ఆదాయ, ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లులు, దేవాలయాల దర్శన టికెట్లు, దేవాలయాల వద్ద రూముల బుకింగ్, ఆర్టీసీ టికెట్ల బుకింగ్ వంటి సదుపాయాలు కూడా వాట్సప్ ద్వారా పొందవచ్చు. రెవెన్యూ, ఇంధన, ఆర్టీసీ, పోలీస్ శాఖల సేవలు వాట్సప్ ద్వారా పొందవచ్చు. ప్రభుత్వ పథకాలు కూడా వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వాట్సప్ సంస్థ మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మెటా సంస్థ సహకారంతో ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి లోకేశ్ మీడియాకు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మీసేవ తరహాల్లో వాట్సప్ ద్వారా పౌరసేవలన్నీ లభిస్తాయన్నారు.